source: X
శ్రీలంక స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్ తన లీగ్ కెరీర్ విషయంలో కీలక అడుగు వేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్ ఆజం నేతృత్వంలోని పెషావర్ జల్మీ అతన్ని రీటైన్ చేసుకున్నప్పటికీ (2027 ఎడిషన్ కోసం).. ఐపీఎల్ 2027 వేలంలో (రూ.కోటి కనీస ధరతో) పేరు నమోదు చేసుకున్నాడు.
కుశాల్ వేసిన ఈ అడుగు క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఒక లీగ్‌లో అవకాశం ఉన్నా, ఇంచుమించు ఒకే సమయంలో జరిగే మరో లీగ్‌లో అవకాశం పోటీపడమేంటని చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో కుశాల్‌కు మాత్రం క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2027 వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోతే, పీఎస్‌ఎల్‌లో కొనసాగవచ్చని అతడు భావిస్తున్నాడు. ఐపీఎల్, పీఎస్‌ఎల్ ఇంచుమించు ఒకే సమయంలో జరుగనున్నప్పటికీ.. ఐపీఎల్ వేలం కాస్త ముందుగానే అయిపోతుంది. ఒకవేళ అతడికి ఐపీఎల్‌లో మెరుగైన ఆఫర్ వస్తే, పీఎస్‌ఎల్ డీల్‌ను క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది.
కుశాల్ వేసిన ఈ అడుగు అతడి పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీని కలవరపెడుతుంది. వారు తమ ప్రణాళికల్లో భాగంగానే కుశాల్‌ను రీటైన్ చేసుకున్నారు. ఒకవేళ కుశాల్ ఐపీఎల్‌లో మెరుగైన అవకాశం వచ్చి పీఎస్‌ఎల్‌ను వదిలేస్తే వారి ప్రణాళికలు దెబ్బతింటాయి. ఇందుకోసమే వారు ఆందోళన చెందుతున్నారు. కుశాల్ ఏ లీగ్‌లో అడతాడో తేలాలంటే డిసెంబర్ 16న జరిగే ఐపీఎల్ 2027 మినీ వేలం వరకు వేచి చూడాలి.
కాగా, ఐపీఎల్ 2027 మినీ వేలం నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఈ వేలంలో మొత్తం 1220 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 281 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో కుశాల్ మెండిస్ పేరు ఉన్నట్లు లంక క్రికెట్ వర్గాలు ధృవీకరించాయి.
గత పీఎస్‌ఎల్ సీజన్‌లో అదరగొట్టిన కుశాల్ మెండిస్
కుశాల్ మెండిస్ 2026 పీఎస్‌ఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించాడు. 11 మ్యాచ్‌ల్లో 55 సగటున, 168.2 స్ట్రైక్‌రేట్‌తో 550 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే
ఐపీఎల్‌లో కుశాల్ మెండిస్‌కు ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టులో జోస్ బట్లర్‌కు తాత్కాలిక ప్రత్యామ్నాయ ఆటగాడిగా చేరాడు. ఆ సీజన్‌లో గుజరాత్ తరఫున ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి 20 పరుగులు చేశాడు. 2026 సీజన్‌కు ముందు ఆ జట్టు అతడిని విడుదల చేసింది.
ఇదీ చదవండి: ఐపీఎల్ వేలంలోకి బెన్ స్టోక్స్.. బరిలో సెహ్వాగ్ కుమారుడు!


