IPL 2027: పంజాబ్‌ కింగ్స్‌కు కొత్త కోచ్‌ | PBKS appoint Paras Mhambrey as bowling coach ahead of IPL 2027 | Sakshi
Sakshi News home page

IPL 2027: పంజాబ్‌ కింగ్స్‌కు కొత్త కోచ్‌

Nov 25 2026 2:50 PM | Updated on Nov 25 2026 2:50 PM

PBKS appoint Paras Mhambrey as bowling coach ahead of IPL 2027

source: X

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ (PBKS)కు కొత్త బౌలింగ్‌ కోచ్‌ వచ్చాడు. జేమ్స్‌ హోప్స్‌ స్థానంలో భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కొత్త బౌలింగ్‌ కోచ్‌గా నియమించబడ్డాడు. గత నెలలో హోప్స్‌తో తెగదెంపులు చేసుకున్నట్లు పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం ప్రకటించింది. హోప్స్‌ ఇకపై ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేయనున్నాడు. వీరిద్దరు గతంలో ముంబై ఇండియన్స్‌లో కలిసి పనిచేశారు.

మాంబ్రేకు అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి అనుభవం ఉంది. 2021 నుంచి 2024 వరకు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆయన పదవీకాలంలోనే భారత్‌ 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. అనంతరం వెస్టిండీస్‌లో జరిగిన 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ మాంబ్రేకు అనుభవం ఉంది. ముంబై ఇండియన్స్ కోచింగ్ బృందంలో ఆయన రెండుసార్లు పనిచేశాడు. టీమిండియా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత మరోసారి ఆ ఫ్రాంచైజీతో చేరాడు. అయితే, గత నెలలో ముంబై ఇండియన్స్ కోచింగ్ సిబ్బందిలో మార్పులు చేయడంతో ఆ జట్టును వీడాడు.

టైటిల్ మాత్రం దక్కలేదు
పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఐపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకోలేదు. రెండుసార్లు ఫైనల్‌కు చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన పంజాబ్.. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది.

2026 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ప్రారంభించింది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించగా.. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే, ఆ తర్వాత ఆ జట్టు జోరు తగ్గింది. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది. దీంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కొత్త బౌలింగ్ కోచ్‌గా మాంబ్రే నియామకంతో వచ్చే సీజన్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డులు బద్దలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement