ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలర్ల విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి, ఓలీ రాబిన్సన్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. బ్యాటర్ల విభాగంలో రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌కు ప్రమోషన్స్ లభించాయి. పంత్ ఓ స్థానం, గిల్ 3, యశస్వి జైస్వాల్ 5, కేఎల్ రాహుల్ 4, పడిక్కల్ 15, జురెల్ 7 స్థానాలు ఎగబాకి 6, 7, 9, 25, 39, 64 స్థానాల్లో నిలిచారు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సత్తా చాటడంతో భారత ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో ఈ మార్పులు వచ్చాయి.
అగ్రస్థానానికి చేరువగా బుమ్రా
భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా చాలాకాలం తర్వాత తిరిగి అగ్రపీఠం దిశగా దూసుకొచ్చాడు. కొంతకాలంగా టెస్టులకు దూరంగా ఉన్న అతడు.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో అతడు రేటింగ్ పాయింట్లు (856) గణనీయంగా పెంచుకొని అగ్రస్థానంలో ఉన్న స్టార్క్ (881)కు చేరువయ్యాడు.
బ్యాటర్ల ర్యాంకుల్లోనూ భారీ పురోగతి
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో భారత బ్యాటర్లంతా చెలరేగారు. రాహుల్, పంత్ సెంచరీలతో కదంతొక్కగా.. గిల్, జైస్వాల్, పడిక్కల్ సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. జురెల్ కూడా అర్ద సెంచరీతో రాణించాడు. ఈ ప్రదర్శనల కారణంగా వారు ర్యాంకింగ్స్‌లో భారీ పురోగతి సాధించారు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డులు బద్దలు


