కివీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా కీలక నిర్ణయం | India Make Big Call Ahead Of 2nd Test Vs NZ Cancel Team Activity | Sakshi
Sakshi News home page

కివీస్‌తో రెండో టెస్టు.. టీమిండియా కీలక నిర్ణయం

Nov 23 2026 6:00 PM | Updated on Nov 23 2026 6:02 PM

India Make Big Call Ahead Of 2nd Test Vs NZ Cancel Team Activity

భారత జట్టు (PC: BCCI X)

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు టీమిండియా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. క్రైస్ట్‌చర్చ్‌ మ్యాచ్‌కు ముందు నిర్వహించాలనుకున్న చిన్నపాటి ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసింది. కాగా కివీస్‌- భారత్‌ మధ్య వెల్లింగ్‌టన్‌ వేదికగా తొలి టెస్టు సోమవారం ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే.

భారత్‌ భారీ స్కోరు
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 720 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అయితే, ఆఖరి రోజు ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ 239 పరుగులు చేసింది.

పట్టుదలగా నిలబడ్డ మిచెల్‌, ఫిలిప్స్‌
కివీస్‌ బ్యాటర్లు డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ పట్టుదలగా నిలబడటంతో మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు 121 ఓవర్లు,రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లు  బౌలింగ్‌ చేశారు. పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అత్యధికంగా 55 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు.

అలసిపోయిన భారత బౌలర్లు
పేసర్లలో అన్షుల్‌ కాంబోజ్‌, ప్రసిద్‌ కృష్ణ చెరో 45 ఓవర్లు బౌలింగ్‌ చేయగా.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 49 ఓవర్లు వేశాడు. ఆకాశ్‌ దీప్‌ 43 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. వీరికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో దేవదత్‌ పడిక్కల్‌, యశస్వి జైస్వాల్‌, ధ్రువ్‌ జురెల్‌ కూడా పార్ట్‌టైమ్‌ బౌలర్లుగా బరిలోకి దిగారు. మరోవైపు.. కివీస్‌ మాత్రం కేవలం 166 ఓవర్లే బౌలింగ్‌ చేసింది.

ఈ నేపథ్యంలో బౌలర్లపై పనిభారం తగ్గించే క్రమంలో రెండో టెస్టుకు ముందు టీమ్‌ యాక్టివిటీని రద్దు చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ప్రకటించాడు. తొలి టెస్టు డ్రా అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా బౌలర్లు చాలా ఓవర్లు బౌలింగ్‌ చేశారు.

అందుకే టీమ్‌ యాక్టివిటీ రద్దు
వాళ్లను కచ్చితంగా డిన్నర్‌కి తీసుకువెళ్తాము. నిజానికి మాకొక టీమ్‌ యాక్టివిటీ సెషన్‌ ఉంది. కానీ తొలి టెస్టులో ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ చేయాల్సి వచ్చినందున దానిని రద్దు చేస్తున్నాము. ముఖ్యంగా మా ఫాస్ట్‌బౌలర్లు బాగా అలసిపోయారు. రెండో టెస్టు శుక్రవారం నుంచే మొదలుకానుంది.

కాబట్టి పనిభారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము’’ అని గిల్‌ స్పష్టం చేశాడు. కాగా కివీస్‌- భారత్‌ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మొదలుకానుండగా.. ఇందుకు క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్‌ మైదానం వేదిక.

ఇదీ చదవండి: ‘వాళ్లిద్దరు ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు.. రెండో టెస్టులోనూ చోటు క‌ష్టమే’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement