PC: Instagram
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ వ్యక్తిగత జీవితం గురించి కొంతకాలంగా వదంతులు వ్యాపిస్తున్నాయి. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో సారా ప్రేమలో ఉందంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై అటు గిల్ గానీ.. ఇటు సారా గానీ స్పందించలేదు.
అతడితో పెళ్లి అంటూ రూమర్లు
ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్ కుమారుడు రాజ్‌వీర్ డియోల్‌తో సారా పేరును ముడిపెడుతూ గాసిప్‌రాయుళ్లు కథనాలు సృష్టించారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇరు కుటుంబాలు ఇందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాయని సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పటికే సారా మీద ప్రేమతో రాజ్‌వీర్ కానుకల వర్షం కురిపించాడని తోచినట్టుగా రాసిపడేశారు.
కనీసం ముఖాలు కూడా చూసుకోలేదు
అయితే, ఈ రూమర్లపై సారా సన్నిహిత వర్గాలు తాజాగా స్పందించాయి. బాంబే టైమ్స్ కథనం ప్రకారం.. ‘‘ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. సారా, రాజ్‌వీర్ కనీసం ఒక్కసారి కూడా ముఖాముఖి ఎదురుపడలేదు. సారా ప్రస్తుతం సింగిల్‌గానే ఉంది.
ఇదంతా చెత్త ప్రచారం
ఆమె తన పని మీద మాత్రమే దృష్టి సారించింది. ఇదో చెత్త ప్రచారం. సంచలనం కోసం ఏదేదో రాస్తున్నారు. ఇలాంటి చెత్త కథనాలపై సారా ఎప్పటికీ స్పందించదు. ఆమె ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోదు. ఎంతో హుందాగా వ్యవహరిస్తుంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఏడాది అర్జున్ వివాహం
కాగా సచిన్- అంజలి దంపతులకు తొలి సంతానంగా సారా జన్మించగా.. తర్వాత అర్జున్ జన్మించాడు. తండ్రి బాటలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న అర్జున్.. ఇప్పటికీ గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నాడు. అయితే, ఈ ఏడాది అతడు వివాహ బంధంలో అడుగుపెట్టాడు.
ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సానియా చందోక్‌తో అర్జున్ పెళ్లి జరిగింది. అక్క కంటే ముందే తమ్ముడు వివాహం చేసుకోవడంతో.. అందరి దృష్టి సారాపై పడింది.
బిజీ బిజీగా సారా
అయితే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, న్యూట్రీషనిస్ట్, బయో మెడికల్ సైంటిస్ట్, మోడల్ అయిన సారా.. ఇటీవలే ముంబైలో ఓ వెల్‌నెస్ సెంటర్ కూడా ప్రారంభించింది. అంతేకాదు సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా తన విధులతో బిజీగా గడుపుతోంది. ఇలాంటి సమయంలో రాజ్‌వీర్‌తో పెళ్లంటూ వదంతులు రావడం గమనార్హం.
ఇదీ చదవండి: ‘వాళ్లిద్దరు ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు.. రెండో టెస్టులోనూ చోటు కష్టమే’


