భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు తండ్రి బాటలో నడుస్తూ ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. కొద్ది రోజుల కిందట పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 ఆసియా కప్‌లో బ్యాట్‌తో సంచలనాలు సృష్టించగా.. తాజాగా చిన్న కుమారుడు వేదాంత్ సెహ్వాగ్ కూచ్ బెహర్ ట్రోఫీలో బంతితో అద్భుతం చేశాడు.
ఈ టోర్నీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరఫున ఆడుతున్న వేదాంత్.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఏడు వికెట్లు (22.3 ఓవర్లలో 88 పరుగులిచ్చి) పడగొట్టాడు. వేదాంత్ ధాటికి పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.
వేదాంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీకి అతడి అన్న ఆర్యవీర్ కెప్టెన్సీ వహిస్తున్న విషయం గమనార్హం. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఆర్యవీర్ 94 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యాడు.
కాగా, వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్‌లో విధ్వంసకర ఓపెనర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 104 టెస్టుల్లో 8586 పరుగులు, 251 వన్డేల్లో 8273 పరుగులు సాధించాడు. సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ వయోపరిమితి క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు తమ్ముడు వేదాంత్ కూడా అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు.
ఇదీ చదవండి: సత్తా చాటిన అభిషేక్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా


