రూ.206 కోట్ల బంగారం.. శ్రీవారికి సమర్పించిన వ్యక్తి ఎవరో తెలుసా? | Meet the Chennai Entrepreneur Who Donated 121 Kg of Gold to Lord Venkateswara | Sakshi
Sakshi News home page

రూ.206 కోట్ల బంగారం.. శ్రీవారికి సమర్పించిన వ్యక్తి ఎవరో తెలుసా?

Nov 27 2026 8:02 AM | Updated on Nov 27 2026 8:33 AM

Meet the Chennai Entrepreneur Who Donated 121 Kg of Gold to Lord Venkateswara

ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నపేరు వర్ధమాన్ జైన్. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఏకంగా 121 కేజీల బంగారు ఆభరణాలను విరాళంగా అందించి.. అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో చాలామంది ఎవరీ జైన్?, అని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

చెన్నైకి చెందిన ఈ ప్రముఖ వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్.. తన భార్య రాధికా జైన్‌తో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.206 కోట్లు. ఇందులో మొత్తం 46 రకాల ఆభరణాలు ఉన్నాయి. కిరీటం, హారాలు, భుజాలకు ధరించే ఆభరణాలు, నడుము ఆభరణాలు ఇలా ఎన్నో ప్రత్యేకమైన నగలు ఇందులో ఉన్నాయి. కొన్ని ఆభరణాలను వజ్రాలతో కూడా అందంగా రూపొందించారు.

ఎవరీ వర్ధమాన్ జైన్?
వర్ధమాన్ జైన్ చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన యాక్సెస్ హెల్త్‌కేర్‌ అనే అంతర్జాతీయ సంస్థకు వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్‌ కూడా.

  • చెన్నైలోని లయోలా కళాశాలలో స్టాటిస్టిక్స్ చదివిన ఆయన, ఆ తర్వాత అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు.

  • 1997లో అనురాగ్ జైన్‌తో కలిసి విజన్ హెల్త్‌సోర్స్‌ అనే సంస్థను ప్రారంభించారు. అమెరికాలో ఆసుపత్రులకు సంబంధించిన మెడికల్ బిల్లింగ్, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల నిర్వహణ వంటి సేవలను ఈ కంపెనీ అందించేది. అతి తక్కువ కాలంలోనే సంస్థ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2003లో పెరోట్ సిస్టమ్స్ ఈ సంస్థను కొనుగోలు చేసింది.

  • ఆ తర్వాత 2009లో డెల్ సంస్థ పెరోట్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేయడంతో.. జైన్ డెల్ సర్వీసెస్ గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ కార్యకలాపాలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 9,000 మంది ఉద్యోగులతో పాటు 100కు పైగా క్లయింట్లకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక సంస్థను నిర్మించాలనే ఆలోచనతో యాక్సెస్ హెల్త్‌కేర్‌ను స్థాపించారు.

యాక్సెస్ హెల్త్‌కేర్‌
యాక్సెస్ హెల్త్‌కేర్‌ అనేది.. ప్రధానంగా ఆసుపత్రులకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా సేవలను అందిస్తుంది. ముఖ్యంగా ఆసుపత్రుల బిల్లింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, చెల్లింపుల నిర్వహణ వంటి పనులను సులభతరం చేస్తుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

ఆయన నిర్మించిన ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగింది. 2025 జనవరిలో అమెరికాకు చెందిన న్యూ మౌంటెన్ క్యాపిటల్ కంపెనీ యాక్సెస్ హెల్త్‌కేర్‌లో భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ సుమారు 1.5 నుంచి 2 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం.

సేవా కార్యక్రమాలు
వర్ధమాన్ జైన్ ప్రత్యేకత ఏమిటంటే.. వ్యాపారంలో సంపాదించడమే కాకుండా సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఉంది. ఈ కారణంగానే.. శ్రీ సరితా జైన్ ఫౌండేషన్ ట్రస్ట్‌ ద్వారా విద్య, ఆహార పంపిణీ, అత్యవసర వైద్య సహాయం వంటి కార్యక్రమాలకు తోడ్పడుతున్నారు.

పేద కుటుంబాలకు చెందిన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆవిష్కార్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా.. చెన్నైలోని కాంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్‌ ద్వారా చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించే కార్యక్రమాలకు కూడా సహకరిస్తున్నారు.

తిరుమల శ్రీవారిపై భక్తి
వర్ధమాన్ జైన్‌కు తిరుమల శ్రీవారిపై అపారమైన భక్తి. అందుకే.. గతంలో కూడా తిరుమల దేవస్థానానికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు. 

  • శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించారు. 

  • తిరుమల గోశాలలో పశువులకు దాణా తయారు చేసే మిక్సింగ్ ప్లాంట్ కోసం రూ.5 కోట్లు ఇచ్చారు. 

  • నాణేలను వేరు చేసే యంత్రం కోసం రూ.1 కోటి అందించారు. 

  • తిరుమలలో భక్తుల రవాణా సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందించారు. 

  • ఇప్పుడు తాజాగా రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు.

ఇదీ చదవండి: బోర్డు మీటింగ్‌లో మొదలై.. హైకోర్టుకు చేరిన పంచాయితీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement