క్రెడిట్‌ కార్డులు తెగ వాడేస్తున్నారు!  | Credit card spending rises 20percent to Rs 2. 45 lakh crore in October 2026 | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డులు తెగ వాడేస్తున్నారు! 

Nov 27 2026 5:00 AM | Updated on Nov 27 2026 5:00 AM

Credit card spending rises 20percent to Rs 2. 45 lakh crore in October 2026

డెబిట్‌ కార్డులతో పోలిస్తే కొనుగోళ్లు 6 రెట్లు అధికం 

అక్టోబర్‌లో రూ. 2.45 లక్షల కోట్లు

ఆర్‌బీఐ గణాంకాల్లో వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయంగా క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. అక్టోబర్‌లో డెబిట్‌ కార్డులతో పోలిస్తే ఆరు రెట్లు అధికంగా నమోదయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెల క్రెడిట్‌ కార్డులతో చేసిన వ్యయాలు రూ. 2.45 లక్షల కోట్లుగా ఉండగా, డెబిట్‌ కార్డులతో ఖర్చులు రూ. 40,492 కోట్లుగా ఉన్నాయి. 

డెబిట్‌ కార్డుల ద్వారా ఏటీఎంలు, పీవోఎస్‌ టెర్మినల్స్‌ నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌ పరిమాణం 42.04 కోట్ల లావాదేవీలవ్యాప్తంగా రూ. 2.33 లక్షల కోట్లుగా ఉంది. క్రెడిట్‌ కార్డులతో ఆన్‌లైన్‌లో రూ. 1.54 లక్షల కోట్ల వ్యయ లావాదేవీలు జరగ్గా పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ టెర్మినల్స్‌లో (పీవోఎస్‌) రూ. 90,562 కోట్ల కొనుగోళ్లు జరిగాయి. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌ సుమారు రూ. 415 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, డెబిట్‌ కార్డుతో అత్యధికంగా పీవోఎస్‌ టెర్మినల్స్‌లో రూ. 24,957 కోట్లు, ఆన్‌లైన్‌లో రూ. 15,284 కోట్ల మేర లావాదేవీలు నమోదయ్యాయి. పీవోఎస్‌ టెర్మినల్స్‌ నుంచి క్యాష్‌ విత్‌డ్రాయల్స్‌ కేవలం రూ. 1.27 కోట్లుగా ఉన్నాయి.  

కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డులు.. నగదుకు డెబిట్‌ కార్డులు.. 
ఈ డేటా ప్రకారం చూస్తే కొనుగోళ్ల కోసం, ముఖ్యంగా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం క్రెడిట్‌ కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోందని నిపుణులు పేర్కొన్నారు. నగదు కోసం ఎక్కువగా డెబిట్‌ కార్డులనే ఉపయోగిస్తున్నారని, డెబిట్‌ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లతో పోలిస్తే ఏటీఎం విత్‌డ్రాయల్సే అధికంగా ఉండటం ఇందుకు నిదర్శనమని చెప్పారు. చెల్లింపు లావాదేవీల కోసం కార్డుల వినియోగం పెరుగుతున్నప్పటికీ ఏటీఎం విత్‌డ్రాయల్స్‌ పరిమాణం, విలువను బట్టి చూస్తే రోజువారీ లావాదేవీల్లో నగదే రారాజుగా ఉంటున్న సంగతి తెలుస్తోందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement