లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కారు కొనాలంటే.. చాలామంది బ్యాంకు లోన్ లేదా నగదు చెల్లింపుల గురించి ఆలోచిస్తారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా రూ.85 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును రెండు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (Amex) కార్డులను ఉపయోగించాడు. ఈ విషయాన్ని రెడ్డిట్‌లో పంచుకోవడంతో.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
రెడ్డిట్ యూజర్ తన కారు కొనుగోలు అనుభవాన్ని వివరించాడు. రూ.85 లక్షల విలువైన కారును కొనడానికి.. 60 శాతం అంటే రూ.51 లక్షలను ఐసీఐసీఐ ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డుతో చెల్లించాడు. మిగిలిన 40 శాతం అంటే రూ.34 లక్షలను అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించినట్లు తెలిపాడు. ఇలా.. ఒకే కారు కొనుగోలుకు రెండు వేర్వేరు క్రెడిట్ కార్డులను ఉపయోగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అదనపు ఛార్జి కూడా..
అయితే.. ఈ చెల్లింపు అంత సులభంగా జరగలేదట. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీ చేయనున్న విషయాన్ని ముందుగానే తన చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా బ్యాంకు రిలేషన్‌షిప్ మేనేజర్‌కు తెలియజేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. అయినప్పటికీ.. మొదట ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు లావాదేవీ తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత బ్యాంకు నుంచి ఫోన్ రావడంతో తాను చేస్తున్న లావాదేవీని ధ్రువీకరించాల్సి వచ్చింది. ఆ తరువాత బ్యాంకు ఆ చెల్లింపును ఆమోదించింది. ఈ కొనుగోలులో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు కంటే ఐసీఐసీఐ కార్డు చాలా సులభంగా పనిచేసిందని అతను చెప్పడం విశేషం. అయితే క్రెడిట్ కార్డుతో చెల్లింపు చేసినందుకు కారు డీలర్ ఒక శాతం అదనపు ఛార్జీ వసూలు చేశాడని కూడా వెల్లడించాడు.

బ్యాంక్ తీరుపై అసంతృప్తి
అయితే తాను చెల్లింపులు చేసే సమయంలో.. ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహరించిన తీరుపై ఆ వ్యక్తి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపు చేయబోతున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ, బ్యాంకు నుంచి పదేపదే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపాడు. అంతేకాకుండా.. తాత్కాలికంగా క్రెడిట్ పరిమితిని పెంచాలని కోరినా ఐసీఐసీఐ బ్యాంకు అంగీకరించలేదని చెప్పాడు. గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు మాత్రం తనకు తాత్కాలిక క్రెడిట్ లిమిట్ పెంపు సౌకర్యాన్ని కల్పించిందని పేర్కొన్నాడు. భారీ మొత్తాల లావాదేవీలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను బ్యాంకులు మరింత సులభతరం చేయాలని అభిప్రాయపడ్డాడు.
ఈ రెడ్డిట్ పోస్ట్‌పై.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. ఇంత పెద్ద మొత్తంలో.. క్రెడిట్ కార్డులతో కారు ఎలా కొనుగోలు చేశారని కొందరు ప్రశ్నించగా, మరికొందరు రెండు కార్డులను ఉపయోగించి చెల్లింపు చేయడం మంచి ఆలోచన అంటూ అభినందించారు. మొత్తానికి.. రూ.85 లక్షల బీఎండబ్ల్యూ కారును రెండు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన ఈ ఘటన సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


