BMW కార్లలో ఫైర్ టెన్షన్.. 7.20 లక్షల వాహనాలకు రీకాల్! | BMW Recalls Over Seven Lakh Cars in US | Sakshi
Sakshi News home page

BMW కార్లలో ఫైర్ టెన్షన్.. 7.20 లక్షల వాహనాలకు రీకాల్!

Nov 16 2026 9:02 AM | Updated on Nov 16 2026 9:06 AM

BMW Recalls Over Seven Lakh Cars in US

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. అమెరికాలో ఏకంగా 7,20,796 కార్లకు రీకాల్ ప్రకటించింది. కార్లలో సాంకేతిక లోపం కారణంగా.. ఎప్పుడైనా మంటలు చెలరేగే ప్రమాదం ఉందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) హెచ్చరించింది. ముఖ్యంగా కారును నడుపుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. పార్కింగ్ చేసి ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మంటలు వచ్చే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

కార్లలో సమస్య కారణంగా.. యజమానులు తమ వాహనాలను తాత్కాలికంగా ఇళ్లలోని గ్యారేజీల్లో, భవనాల దగ్గర లేదా ఇతర వాహనాల పక్కన పార్క్ చేయకుండా, బయట బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేయాలని అధికారులు సూచించారు.

అసలు సమస్య ఏమిటి?
బీఎండబ్ల్యూ కార్లలో వాటర్ పంప్‌కు అనుసంధానించిన ఎలక్ట్రికల్ కనెక్టర్‌లో లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ కనెక్టర్‌కు సరైన సీలింగ్ లేకపోవడం వల్ల వర్షపు నీరు లేదా ఇతర కారణాల ద్వారా తేమ లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అలా నీరు కనెక్టర్‌లోకి చేరితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో.. వేడి పెరిగి చివరకు కారులో మంటలు చెలరేగే ప్రమాదం ఉందని NHTSA తెలిపింది.

ఇదే సమస్యను బీఎండబ్ల్యూ.. 2024లో కూడా గుర్తించి రీకాల్ ప్రకటించింది. అప్పట్లో ఇదే 7,20,796 కార్లకు మరమ్మతులు చేపట్టింది. అయితే అప్పట్లో చేసిన మరమ్మతులు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోయాయి. గతంలో రీకాల్ కింద మరమ్మతులు చేయించుకున్న కార్లలో కూడా మళ్లీ ఈ సమస్య కనిపించే అవకాశం ఉండటంతో కంపెనీ మరోసారి రీకాల్ ప్రకటించింది.

ఇప్పటికే 10 ఘటనలు
2024లో మరమ్మతులు చేయించుకున్న వాహనాల్లో కూడా ఈ సమస్యకు సంబంధించి లేదా సంబంధం ఉండవచ్చని భావిస్తున్న సుమారు 10 ఘటనలు అమెరికాలో నమోదైనట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఈ ఘటనల కారణంగా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని NHTSA తెలిపింది.

ప్రస్తుతం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించే కొత్త మరమ్మతు విధానాన్ని బీఎండబ్ల్యూ అభివృద్ధి చేస్తోంది. ఆ పరిష్కారం సిద్ధమైన తర్వాత ప్రభావిత వాహనాలకు అధీకృత సర్వీస్ కేంద్రాల్లో ఉచితంగా మరమ్మతులు చేయనున్నారు. అంటే కస్టమర్లు ఈ రీకాల్ మరమ్మతుల కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

2012 నుంచి 2018 మధ్య తయారైన పలు బీఎండబ్ల్యూ కార్లు ఈ రీకాల్ పరిధిలోకి వస్తున్నాయి. ప్రభావిత కార్ల యజమానులకు సంస్థ 2026 డిసెంబర్ 25 నుంచి రీకాల్ నోటీసులు పంపించడం ప్రారంభించనుంది. అదే తేదీ నుంచి NHTSA అధికారిక వెబ్‌సైట్‌లో వాహన గుర్తింపు సంఖ్య (VIN) ద్వారా తమ కారు రీకాల్ పరిధిలో ఉందో లేదో తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement