జీవితకాల గరిష్ఠానికి అత్యంత చేరువలో బ్యాంక్ నిఫ్టీ
రెండు వారాల్లోనే ఏకంగా 14 శాతం పెరిగిన ఇండెక్స్
ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబీ వంటి ప్రభుత్వ రంగ షేర్లూ ఆకర్షణీయం
వేగంగా ర్యాలీ చేసిన ఐసీఐసీఐ, యాక్సిస్, ఇతర ప్రైవేటు బ్యాంకులు
భారీగా పడిపోయి... అంతలోనే ర్యాలీ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ
క్యూ2 ఫలితాల్లో స్పష్టమైన వృద్ధి కనిపించటమే ప్రధాన కారణం
ఎఫ్‌ఐఐల కొనుగోళ్లతో మిగిలిన ఇన్వెస్టర్లూ జత... ఫలితం ర్యాలీ
కాకపోతే ఈ ర్యాలీకి బ్రేక్ పడే అవకాశాలూ లేకపోలేదు
ఇన్వెస్టర్లు వాల్యుయేషన్లను చెక్ చేసుకుని ముందుకెళితే బెటర్
అధిక వాల్యుయేషన్లుంటే కనక ఒకటిరెండు క్వార్టర్లు వేచిచూస్తే మంచిది
ఎక్కువ సమయమేమీ పట్టలేదు. నిండా నెల కూడా కాలేదు. స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ రంగ స్వరూపమే మారిపోయింది. బాగా పడిపోయి... ఏడాది కనిష్ఠస్థాయిలకు చేరి... అక్కడి నుంచి మెల్లగా కాస్తంత పెరుగుదల చూసిన బ్యాంకులు ఒక్కసారిగా ఆకర్షణీయంగా మారిపోయాయి. ప్రైవేటు బ్యాంకులతో పాటు ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ నెలరోజుల్లో భారీ ర్యాలీ చేశాయి. చాలా బ్యాంకులు కొత్త గరిష్ఠ స్థాయి నమోదు చేయడానికి సిద్ధమవుతున్నాయి. అంతెందుకు? బ్యాంకుల పనితీరును సూచించే ‘బ్యాంక్ నిఫ్టీ’... కొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేయటానికి కేవలం 500 పాయింట్ల దూరంలో ఉంది. ఈ నెల్లోనే ఇప్పటిదాకా 14 శాతం వరకూ పెరిగింది. ఎందుకిలా? అసలు ఇంతలా పెరగటానికి కారణమేంటి? మన బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు అకస్మాత్తుగా మారిపోయాయా? నిరర్థక ఆస్తులు తగ్గాయా? లాభాలు పెరిగాయా? బ్యాంకుల రీరేటింగ్ ఏమన్నా జరుగుతోందా? అలాగైతే ఏ బ్యాంకులు బెటర్? ఇన్వెస్టర్లు ఏం చేయాలి? వేటిని ఎంచుకుంటే మంచిది? ‘బ్యాంకింగ్ ఎకానమీ’పై లోతైన విశ్లేషణే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...
పెరుగుతున్న ఆదాయాలకు తగ్గట్టే భారత బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం సైతం కొన్నాళ్లుగా బలమైన వృద్ధిని నమోదు చేస్తోంది. టెక్నాలజీతో ఖర్చులు తగ్గించుకుని మార్జిన్లు మెరుగు పరుచుకంటున్నా... నిరర్థక ఆస్తులు, మొండి బకాయిల వంటి సమస్యలు వెంటాడుతుండటంతో కొన్ని ప్రయివేటు రంగ బ్యాంకులు తప్ప మిగతావాటి పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటంతో ఆ ప్రభావం షేర్లపైనా కనిపించింది. కానీ 2వ త్రైమాసికం ఫలితాలు ఈ పరిస్థితిని మార్చేయటం వల్లే ఇంతటి ర్యాలీ సాధ్యమైందని అనుకోవచ్చు.
మార్జిన్లలో మెరుగైనవి కొన్నే..!
మొదటిది... ఆదాయాలతో పాటు రుణ నాణ్యత పెరిగింది. వీటివల్ల బ్యాంకు షేర్లపై ఇన్వెస్టర్ల వైఖరి మారింది. రెండోది... బ్యాంకుల రిస్కు సామర్థ్యం మెరుగై స్థాయి మారింది. దీంతో బాగా వెన కబడి ఉండే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఫోకస్‌లోకి వచ్చాయి. దిగ్గజ ప్రయివేటు బ్యాంకులు ఆకర్షణీయంగా కనిపించి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఎఫ్‌ఐఐలు మళ్లీ కొనుగోళ్లకు దిగారు. విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే... ‘క్యూ2 ఫలితాలు... ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు... తగ్గిన క్రూడ్ ధరలు ఇవే బ్యాంకు షేర్లను పరుగులెత్తిస్తున్నాయి. కాకపోతే దీర్ఘకాలంలో ఏమవుతుందో కాస్త వేచిచూడాలి’. వాస్తవానికి క్యూ2లో దాదాపు అన్ని బ్యాంకులూ ఆదాయాలు, రుణ నాణ్యత విషయంలో మంచి పనితీరు చూపించాయి. కానీ మార్జిన్లలో చాలా తేడాలున్నాయి. అగ్రగామి బ్యాంకుల్లో చాలావరకూ లాభాల్లో రెండంకెల వృద్ధిని చూపించినా వృద్ధి నాణ్యత ఒకేలాలేదు. వడ్డీ ఆదాయం... తగ్గిన రుణ వ్యయాలు... అసాధారణ లేదా అనుబంధ వ్యాపారాల నుంచి వచ్చిన ఆదాయం... అన్నీ ప్రభావం చూపించాయనే చెప్పాలి. అయితే లాభం వెనక మర్మం తెలియాలంటే నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఎం), మొండి బాకీలు, రుణ వ్యయం కూడా చూడాల్సి ఉంటుంది.
మార్జిన్లు... అసెట్ క్వాలిటీ
ఆదాయాల వెనక నిధుల పరుగు
ప్రధాన బ్యాంకుల ఫలితాలన్నీ చూసినపుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అది... బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల కన్నా రుణాలే వేగంగా పెరగుతున్నాయని. దీంతో డిపాజిట్ల కోసం పోటీ ఊపందుకుందని. ఆర్‌బీఐ డేటా ప్రకారం... డిపాజిట్లు 16.7 శాతం పెరగ్గా... రుణాలు మాత్రం 18 శాతం పెరిగాయి. మరి బ్యాంకులు దీనికి తగ్గ నిధులను సమకూర్చుకోవటానికి ఎంత వెచ్చిస్తాయన్నదే ప్రధానం. పైపెచ్చు బ్యాంకులు ప్రకటించిన డిపాజిట్లలో నాన్ రెసిడెంట్ల ఫారిన్ కరెన్సీ (ఎఫ్‌సీఎన్‌ఆర్) డిపాజిట్లూ భారీగానే ఉన్నాయి. వీటిని డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది కనక రూపాయి మారకం విలువ రిసు్కలు బ్యాంకులే భరించాలి. యాక్సిస్ బ్యాంకు తన డిపాజిట్లు 21 శాతం పెరిగినప్పటికీ ఎఫ్‌సీఎన్‌ఆర్ ఖాతాల్ని మినహాయిస్తే 17 శాతంగానే ఉంటందని ప్రకటించింది. ఐసీఐసీ 30 శాతంగా ప్రకటించినా ఎఫ్‌సీఎన్‌ఆర్‌ను మినహాయిస్తే 24 శాతమే. కోటక్ బ్యాంకు అయితే ఇది 23–13 శాతంగా ఉంది.
ఇదంతా ఎందుకంటే ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్లను కూడా కలిపి చూసినపుడు డిపాజిట్లలో వృద్ధి ఎక్కువే అనిపించవచ్చు. కానీ ఎఫ్‌సీఎన్‌ఆర్ వల్ల నికర వడ్డీ మార్జిన్లు తగ్గిపోతాయి. కాసా నిష్పత్తి కూడా తక్కువే ఉంటుంది. కాబట్టి ఈ ఎఫ్‌సీఎన్‌ఆర్ నిధుల్ని బ్యాంకులు ఎలా వాడతాయన్నదే వాటి వడ్డీ మార్జిన్లను నిర్దేశిస్తుంది. వచ్చే రెండు త్రైమాసికాలూ గమనించాల్సింది ఇదే.
షేర్లలో ఎందుకంత జోరు?
→ రెండవ త్రైమాసికం ఫలితాల ద్వారా ఆదాయాల్లో వృద్ధి స్పష్టంగా కనిపించింది. మొండి బాకీలు తగ్గాయి. మళ్లీ మునుపటి నిరర్థక ఆస్తుల సైకిల్‌లోకి బ్యాంకులు వెళ్లిపోతాయేమోనన్న భయాలు తగ్గాయి.
→ ఎస్‌బీఐ, బ్యాంక్ ఆప్ బరోడా పటిష్ఠమైన ఫలితాలు ప్రకటించటంతో ఇన్వెస్టర్లు ప్రభుత్వ రంగ బ్యాంకులవైపు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వ– ప్రైవేటు బ్యాంకుల మధ్య అంతరాయం కొంత తగ్గింది.
→ అప్పటికే బాగా తగ్గి ఉండటంతో బ్యాంకు షేర్లు ఆకర్షణీయంగా కనిపించాయి. ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు మొదలవటంతో రివ్వుమన్నాయి. దీంతో
మిగిలిన ఇన్వెస్టర్లూ వీటివెంట పడ్డారు. ఫలితం... ర్యాలీ ఊపందుకుంది.
→ 100 డాలర్లు దాటేసిన ముడిచమురు ధరలు కొంతవరకూ తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్బణం కొంత ఉపశమించటం, దేశీయంగా రుణ డిమాండ్ ఆరోగ్యకరంగా ఉండటం... ఇవన్నీ కూడా కలిసొచ్చాయని చెప్పాలి.
ఇదే జోరు కొనసాగాలంటే...
రుణాల డిమాండ్ మరింత పటిష్ఠంగా మారితే ఈ ర్యాలీ మరికొంత వరకూ కొనసాగవచ్చు. కాకపోతే రుణ వ్యయం మాత్రం నియంత్రణలో ఉండాలి. బ్యాంకులు తమ డిపాజిట్లను వేగంగా వడ్డీ ఇచ్చే ఆస్తుల్లా మార్చుకోవాలి. కాసా డిపాజిట్లలో స్థిరమైన వృద్ధి... ఎన్‌ఐఎం వృద్ధి... తక్కువ నిరర్థక ఆస్తులు కనక సాధ్యమైతే బ్యాంకుల మూలాలు మరింత బలోపేతమవుతున్నట్లు లెక్క. ఇవే తదుపరి ర్యాలీకి ఆజ్యం పోస్తాయి. కాకపోతే డిపాజిట్లను ఆకర్షించడానికి వడ్డీరేట్ల పెంపు వంటివి చేస్తే ఆ ప్రభావం మార్జిన్లపై పడుతుంది. ఒకవేళ ఎస్‌ఎంఈలకిచ్చే రుణాలు, అన్‌సెక్యూర్డ్ రుణాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తే అది ఎన్‌పీఏల పెరుగుదలకు దారితీయవచ్చు. మళ్లీ ఎఫ్‌ఐఐల విక్రయాలు మొదలైనా, క్రూడ్ ధరలు పెరిగినా కూడా ర్యాలీకి బ్రేక్ పడొచ్చు.
ప్రధాన బ్యాంకుల స్కోరు ఎలా ఉందంటే..
ఎస్‌బీఐ... వాల్యుయేషన్ కీలకం
రెండో త్రైమాసికంలో రూ.23,038 కోట్ల లాభంతో 14.3 శాతం వార్షిక వృద్ధిని కనబరిచింది. నికర వడ్డీ మార్జిన్... అంటే డిపాజిట్లపై ఇచ్చే వడ్డీకి, రుణాలపై వసూలు చేసే వడ్డీకి మధ్య ఉన్న తేడా 2.94 శాతంగా ఉంది. ఇదే బ్యాంకులకు అసలైన ఆదాయం. స్థూల నిరర్థక ఆస్తులు 1.39 శాతంగా ఉన్నా నికర ఎన్‌పీఏలు మాత్రం 0.36 శాతానికే పరిమితమయ్యాయి. అడ్వాన్సులు 17.8 శాతం, కాసా (కరెంట్, సేవింగ్స్ ఖాతాలు) వృద్ధి 38.3 శాతం ఉండగా... రుణాలకు పెట్టే ఖర్చు 0.22 శాతం తగ్గింది. ఇవన్నీ ఎస్‌బీఐ బలాన్ని చెప్పేవే. విస్తృత వృద్ధి, మెరుగుపడుతున్న వడ్డీ మార్జిన్లు, రుణ వ్యయంతో పాటే తగ్గుతున్న ఎన్‌పీఏలు, డిపాజిట్లలో వృద్ధి... ఇవన్నీ బ్యాంకును ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. కాకపోతే ఇవన్నీ బ్యాంకు షేరును ఇప్పటికే పెంచేశాయి. వాల్యుయేషన్ కూడా వీటికి తగ్గట్టే ఉందని గమనించాలి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్... వాల్యుయేషన్ తగ్గింది కనకే
సెప్టెంబరు క్వార్టర్లో రూ.19,510 కోట్ల లాభాన్ని ప్రకటించినా వార్షిక వృద్ధి మాత్రం జస్ట్ 4.7 శాతమే. నికర వడ్డీ మార్జిన్లు 3.16 శాతం. స్థూల ఎన్‌పీఏలు 1.11 శాతం. కాకుంటే నికర వడ్డీ ఆదాయం మాత్రం 9.7 శాతం పెరిగింది. విలీనం చేసుకున్న హెచ్‌డీఎఫ్‌సీతో ఇంటిగ్రేషన్ ఏ స్థాయిలో సాధ్యమవుతుందన్నదే కీలకం. ఇప్పటికే బాగా పతనమైంది కనకే ప్రస్తుత ధరల వద్ద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. డిపాజిట్ల వృద్ధి, ఆదాయం ఇంకా మెరుగైతేనే ఇది ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా మారుతుంది.
బ్యాంక్ ఆప్ బరోడా... రీరేటింగ్ జరగొచ్చు
క్యూ2లో రూ.6,532 కోట్ల లాభంతో 35.8 శాతం వృద్ధిని సాధించింది. ఎన్‌ఐఎం 2.74 శాతం కాగా స్థూల నిరర్థక ఆస్తులు 1.78 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 0.37 శాతమే. వాస్తవానికి రిటైల్, ఎంఎస్‌ఎంఈ రుణాల వృద్ధి బాగుంది. నికర ఎన్‌పీఏలు తగ్గుతుండటం శుభ పరిణామమే. బుక్ వేల్యూ కన్నా తక్కువకే ట్రేడవుతున్న ఈ షేరు రీరేటింగ్ జరిగే అవకాశాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం ప్రకటించిన లాభాల్లో ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించటం వల్ల సమకూరిన మొత్తం కూడా కలిసే ఉంది. కనీసం మొత్తం ఆస్తులపై 1 శాతం ఆదాయాన్ని స్థిరంగా పొందుతూ రుణాల్లో వృద్ధిని లాభాలుగా మార్చుకోగలగాలి. అప్పుడే రీరేటింగ్ సాధ్యమవుతుంది.
పీఎన్‌బీ... ప్రోత్సాహకరం
సెపె్టంబరు త్రైమాసికంలో కంపెనీ 12.8 శాతం వార్షిక వృద్ధితో రూ.5,532 కోట్ల లాభాన్ని ప్రకటించింది. వడ్డీ మార్జిన్లు 2.58 శాతంగా ఉండగా స్థూల ఎన్‌పీఏలు 2.55 శాతంగా, నికర ఎన్‌పీఏలు 0.25 శాతంగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏలు బ్యాంకింగ్ పరిశ్రమ సగటుకన్నా ఎక్కువే. కాకపోతే వడ్డీ మార్జిన్లు మెరుగుపడటం, స్థూల ఎన్‌పీఏలు బాగా తగ్గటం వంటివి ప్రోత్సాహకరమే అని చెప్పాలి. ఆస్తులపై రాబడి (ఆర్‌ఓఏ) 1.05 శాతంగా ఉంది. ఇది పెరగటానికి అవకాశాలు చాలా ఎక్కువ. వీటన్నిటినీ చూసినపుడు పీఎన్‌బీ సరైన దిశలోనే వెళుతున్నట్లు అనిపిస్తుంది. దానిపై మరింత స్పష్టత రావటానికి మరికొన్ని త్రైమాసికాలు పట్టొచ్చు.
పీఎన్‌బీ... ప్రోత్సాహకరం
సెపె్టంబరు త్రైమాసికంలో కంపెనీ 12.8 శాతం వార్షిక వృద్ధితో రూ.5,532 కోట్ల లాభాన్ని ప్రకటించింది. వడ్డీ మార్జిన్లు 2.58 శాతంగా ఉండగా స్థూల ఎన్‌పీఏలు 2.55 శాతంగా, నికర ఎన్‌పీఏలు 0.25 శాతంగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏలు బ్యాంకింగ్ పరిశ్రమ సగటుకన్నా ఎక్కువే. కాకపోతే వడ్డీ మార్జిన్లు మెరుగుపడటం, స్థూల ఎన్‌పీఏలు బాగా తగ్గటం వంటివి ప్రోత్సాహకరమే అని చెప్పాలి. ఆస్తులపై రాబడి (ఆర్‌ఓఏ) 1.05 శాతంగా ఉంది. ఇది పెరగటానికి అవకాశాలు చాలా ఎక్కువ. వీటన్నిటినీ చూసినపుడు పీఎన్‌బీ సరైన దిశలోనే వెళుతున్నట్లు అనిపిస్తుంది. దానిపై మరింత స్పష్టత రావటానికి మరికొన్ని త్రైమాసికాలు పట్టొచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంక్.. నాణ్యతే ప్రధానం
క్యూ2లో రూ.4,212 క ఓట్ల లాభాన్ని ప్రకటించినా వార్షిక వృద్ధి మాత్రం ఏకంగా 29.5 శాతం. ఇక నికర వడ్డీ మార్జిన్లయితే 4.31 శాతం. స్థూల, నికర ఎన్‌పీఏలు 1.04 శాతం, 0.24 శాతంగా ఉన్నాయి. రుణాల్లో నాణ్యత, బలమైన నికర వడ్డీ మార్జిన్... ఇవే కోటక్ మహీంద్రాను మిగతా బ్యాంకులకన్నా ముందు నిలబెట్టే అంశాలు. కాకపోతే మార్జిన్లు కొంచెం తగ్గటం, డిపాజిట్ల వృద్ధిలో ఎఫ్‌సీఎన్‌ఆర్, విలీనం చేసుకున్న బ్యాంకుల నుంచి వచ్చిన పోర్టుఫోలియో కూడా ఉండటం వల్ల తదుపరి త్రైమాసిక ఫలితాలే ఈ బ్యాంకు దిశను సూచిస్తాయని స్పష్టంగా చెప్పవచ్చు.
యాక్సిస్ బ్యాంక్... సూపర్ ఫలితాలు
ఈ త్రైమాసికంలో రూ.7,003 కోట్లతో ఏకంగా 37.6% వార్షిక వృద్ధిని ప్రకటించిందీ బ్యాంకు. నికర వడ్డీ మార్జిన్లు 3.36% కాగా స్థూల ఎన్‌పీఏలు 1.16 %గా ఉన్నాయి. డిపాజిట్లు 21%, అడ్వాన్సులు 23% వృద్ధి చెందటం... వార్షికంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు 0.3% తగ్గటం, రుణ వ్యయాలు కూడా 0.45% తగ్గటం కలిసొచ్చే అంశాలు. కాకపోతే ఈ వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఇలాగే కొనసాగుతాయా... లేకపోతే త్వరగా పడిపోతాయా అన్నది ముఖ్యం.
ఐసీఐసీఐ బ్యాంక్... అన్నింట్లోనూ ముందజ
క్యూ2లో 20.1% వృద్ధితో రూ.14,843 కోట్ల లాభాన్ని ప్రకటించింది. నికర వడ్డీ మార్జిన్ ఏకంగా 4.18 శాతం. స్థూల ఎన్‌పీఏలు 1.20 శాతమైతే నికరం మాత్రం 0.30 శాతం. రుణాలు 30 శాతం వృద్ధి చెందగా కీలక ఆపరేటింగ్ ప్రాఫిట్ 21.8 శాతం పెరిగింది. ఒకరంగా చూస్తే కీలకమైన లాభాల వృద్ధితో పాటు తక్కువ నిరర్థక ఆస్తులు, బలమైన వడ్డీ మార్జిన్ అన్నీ కలిసిన అగ్రగామి బ్యాంక్‌గా దీన్ని చెప్పవచ్చు. కాకపోతే ఈ వృద్ధికి తగ్గట్టుగానే షేరు ధర కూడా బాగా పెరిగింది. మరి ఈ వేగం కొనసాగుతుందా? అన్నదే అసలు ప్రశ్న.
(రమణమూర్తి మంథా)


