అక్టోబర్ ద్రవ్యోల్బణం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల అంచనాలే కీలకం
ఎన్విడియా త్రైమాసిక ఫలితాలు, ఫెడ్ మినిట్స్‌పై దృష్టి
పశ్చిమాసియా పరిణామాలు, క్రూడ్ ధరల ప్రభావం
ఈ వారం మార్కెట్ ట్రేడింగ్‌పై స్టాక్ నిపుణుల అంచనా
ముంబై: టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల క్రయవిక్రయాలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు ఈ వారం దేశీయ మార్కెట్లకు కీలకం కానున్నాయి. అలాగే ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశ వివరాలు, పశ్చిమాసియా పరిణామాలు, ముడి చమురు ధరలు, యూఎస్ రిటైల్ అమ్మకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. వీటితో పాటు జపాన్ జీడీపీ, యూరోపియన్ యూనియన్ (ఈయూ), బ్రిటన్ ద్రవ్యోల్బణ గణాంకాలూ ప్రపంచ ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చు. ‘‘సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ కన్సాలిడేషన్‌కు (స్థిరీకరణ) లోనయ్యే వీలుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ పతనాల్లో కొనుగోలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మెరుగైన ఆదాయ అంచనాలున్న లార్జ్–క్యాప్ కంపెనీల షేర్లను ఎంపిక చేసుకునే వ్యూహాన్ని పాటించాలి’’ అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ద్రవ్యోల్బణం–ఆర్‌బీఐ వడ్డీరేట్ల అంచనాలు
అక్టోబర్ టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు (సోమవారం) విడుదల కానున్నాయి. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 2–6 శాతం పరిమితిని దాటి అక్టోబర్‌లో 6.09 శాతానికి ఎగబాకింది. ద్రవ్యోల్బణం పైపైకే చేరుతున్న తరుణంలో డిసెంబర్‌లో జరగనున్న ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) సమావేశంలో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచొచ్చని మెజారిటీ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మరికొందరు 50 బేసిస్ పాయింట్ల పెంపు అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమంటున్నారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలకు అనుగుణంగానే ఈ వారం మార్కెట్లు స్పందించే అవకాశం ఉంది.
ఎన్విడియా ఆర్థిక ఫలితాలపై ఆసక్తి
అంతర్జాతీయ దిగ్గజ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా మంగళవారం (నవంబర్ 17) తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. కంపెనీ సీఈవో జెన్సన్ హువాంగ్ చుట్టూ తలెత్తిన వివాదం కారణంగా గత వారం ఆ సంస్థ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటి ప్రభావంతో గ్లోబల్ మార్కెట్‌లోని ఏఐ షేర్ల ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా.. ప్రస్తుతం ఏఐ ఆధారిత షేర్లకు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా (యాంటీ–ఏఐ ట్రెండ్) ప్రయోజనం పొందుతున్న భారతీయ మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చు.
ఫెడ్ మినిట్స్‌పై దృష్టి
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ 27–28 తేదీల్లో నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన సమావేశపు మినిట్స్‌ను (వివరాలు) బుధవారం (నవంబర్ 18) విడుదల చేయనుంది. గత నెలలో ద్రవ్యోల్బణం తగ్గినట్లు గణాంకాలు వెలువడినప్పటికీ, కేంద్ర బ్యాంక్ డిసెంబర్‌లో వడ్డీ రేట్లను పెంచాలని ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ ఇటీవల తెలిపారు. ‘‘ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌లో కఠినతరమైన ద్రవ్య విధాన (హాకి‹Ù) సంకేతాలు కనిపిస్తే, వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయనే అంచనాలు బలపడతాయి. దీనివల్ల అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు (ఈల్డ్స్) 5 శాతం కీలక స్థాయి కంటే ఎగువనే కొనసాగే అవకాశం ఉంది’’ అని హెచ్‌ఎస్‌టీ వెల్త్ సీఈవో, ఫౌండర్ హరిసెల్వన్ రాధాకృష్ణన్ తెలిపారు.
పశ్చిమాసియా పరిణామాలు, క్రూడ్ ధరలు
ఇరాన్‌లో యుద్ధం దాదాపు ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలివ్వడంతో గత వారం ముడి చమురు మార్కెట్‌కు కాస్త ఊరట లభించింది. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో గత వారం ప్రారంభంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే సౌదీ అరేబియాలోని ఇంధన కేంద్రాలపై తాజాగా దాడులు జరగడం, వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రవాణాకు అంతరాయం కలగడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. అంతర్జాతీయ చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడతాయనే ఆందోళనలు పెరగడంతో ధరలు తిరిగి ఎగబాకాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 96.13 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
25,400 వైపు నిఫ్టీ చూపు
‘‘గత వారం నమోదైన లాభాల తర్వాత, నిఫ్టీ కీలక నిరోధం (25,200) వద్ద కొంత కన్సాలిడేషన్‌కు లోనవుతోంది. ఒకవేళ సానుకూలాంశాలతో ఈ అడ్డంకిని దాటగలిగితే, తదుపరి 25,400 పాయింట్ల వద్ద మరో ప్రధాన నిరోధం ఎదురుకానుంది. ఈ స్థాయిని కూడా విజయవంతంగా చేధించగలిగితే మార్కెట్లో మరో విడత భారీ ర్యాలీకి (లాభాలకు) మార్గం సుగమం కానుంది. పతనాల్లో కొనుగోలు (బై ఆన్ డిప్స్) వ్యూహం అనుసరించాలి. ఒకవేళ మార్కెట్ వెనుకడుగు వేస్తే, దిగువ స్థాయిలో 24,800 – 24,700 పాయింట్లు పటిష్టమైన తక్షణ మద్దతు (సపోర్ట్) స్థాయిలుగా నిలవనున్నాయి’’ అని ట్రేడింగ్
నిపుణులు చెబుతున్నారు.
గత వారంలో పరిమిత లాభాలు
ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగిన గత వారంలో సూచీలు పరిమిత లాభాలు ఆర్జించాయి. ఫలితంగా సెన్సెక్స్ 564 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్లు పెరిగాయి. అంచనాలకు మించిన కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. చిన్న, మధ్య తరహా (మిడ్, స్మాల్ క్యాప్) షేర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు రాణించాయి. ఐటీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే వారాంతంలో బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది.


