బలహీనంగానే సంకేతాలు
కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు
ముడి చమురు ధరలపైనా దృష్టి
అంతర్జాతీయ పరిణామాలూ కీలకమే
ఈ వారం ట్రేడింగ్‌పై స్టాక్ నిపుణుల అంచనాలు
ముంబై: ముడి చమురు ధరల సెగలు, అంతర్జాతీయ అనిశ్చితులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్‌పై బేర్స్ మరింత పట్టు సాధిస్తున్నాయి. మార్కెట్లో బలమైన ‘రికవరీ’ కనిపించే వరకు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. కేవలం ‘ఎంపిక చేసుకున్న షేర్ల’కే పరిమితమై ఉండాలి.
ప్రస్తుతానికి మార్కెట్లో సంకేతాలు బలహీనంగా ఉన్నాయి’’ అని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వారంలో వెలువడే కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పరపతి విధాన వైఖరి, రిలయన్స్ జియో లిస్టింగ్, క్రూడాయిల్ ధరలు, పశ్చిమాసియా పరిణామాలు స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి.
ఆర్థిక గణాంకాలు, క్యూ2 ఫలితాలు కీలకం
దేశీయంగా విడుదలయ్యే స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ సెప్టెంబరు త్రైమాసిక (క్యూ2) ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయి. సెప్టెంబర్ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ), తయారీ రంగ గణాంకాలు అక్టోబర్ 28న (బుధవారం) విడుదల కానున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ముడి చమురు ధరల ఒత్తిళ్లను దేశీయ రంగాలు ఏ మేరకు తట్టుకున్నాయో తెలుసుకునేందుకు ఈ డేటా సాయపడనుంది.
ఇక వారాంతంలో (అక్టోబర్ 30న) సెప్టెంబర్ ‘ద్రవ్యలోటు’ వివరాలతో పాటు అక్టోబర్ 16 నాటి బ్యాంక్ రుణ–డిపాజిట్ల వృద్ధి, అక్టోబర్ 23తో ముగిసిన వారం ‘ఫారెక్స్ నిల్వల’ డేటా వెలువడనుంది. మరోవైపు, క్యూ2 ఫలితాల సందడి కొనసాగనుంది. ఈ వారంలో టీవీఎస్ మోటార్, ఏషియన్ పేయింట్స్, ట్రెంట్, సన్‌ఫార్మా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండియన్ ఆయిల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్ ఇండియా సహా సుమారు 156 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి.
కంపెనీల ఆదాయ వృద్ధి, లాభాల మార్జిన్లతో పాటు యాజమాన్యాల భవిష్యత్ అంచనాలను (గైడెన్స్) మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. కాగా, ఇటీవలి ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఇప్పటికే కొన్ని బ్యాంకింగ్ దిగ్గజాల షేర్లలో దిద్దుబాటు చోటుచేసుకోగా, మిగిలిన ప్రధాన కంపెనీల ఫలితాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయి
అంతర్జాతీయ పరిణమాలపై దృష్టి
భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన సమీక్ష వివరాలు బుధవారం (అక్టోబర్ 28న) విడుదల కానున్నాయి. వడ్డీ రేట్లలో మార్పులు లేకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే, భవిష్యత్ వడ్డీ రేట్ల దిశను తెలిపే ఫెడ్ విధాన ప్రకటన, చైర్మన్ వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.
అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ), బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ వివరాలు గురు, శుక్రవారాల్లో (29, 30 తేదీల్లో) విడుదల కానున్నాయి. మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్‌జలసంధిలో ఇంధన సరఫరాకు ఆటంకాలు కలుగుతాయనే భయాలు క్రూడ్ ధరలను మండిస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 112 డాలర్ల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతుండటం భారత్ వంటి దిగుమతి దేశాలకు ఆందోళనకరంగా మారింది.
నిఫ్టీకి 22,300 స్థాయి కీలకం
ప్రస్తుతం నిఫ్టీకి దిగువ స్థాయిలో 22,300 వద్ద తక్షణ మద్దతు లభిస్తోంది. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే మరింత పతనమై 22,000 స్థాయికి జారే ప్రమాదం ఉంది. ఇక ఎగువ స్థాయిలో 22,850 – 22,900 శ్రేణి అత్యంత కీలకమైన నిరోధంగా కొనసాగుతోంది. నిఫ్టీ ఈ అవరోధాన్ని దాటలేకపోతే ‘పెరిగితే అమ్మడం’ వ్యూహాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఒకవేళ కొనుగోళ్లు పుంజుకొని నిఫ్టీ ఈ స్థాయిని ఛేదించగలిగితే మాత్రం 23,000 – 23,150 స్థాయిల వైపు ర్యాలీ చేసే అవకాశం ఉంది.
గతవారమంతా నష్టాలే
ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగిన గతవారమంతా స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 1,605 పాయింట్లు, నిఫ్టీ 546 పాయింట్ల చొప్పున క్షీణించాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 117 డాలర్లకు పైగా ఎగబాకడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మరోవైపు రిలయన్స్ జియో ఐపీఓ కారణంగా మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గి సెకండరీ మార్కెట్ ట్రేడింగ్‌పై ఒత్తిడి పెంచింది. ఈ పతనం కేవలం బెంచ్‌మార్క్ సూచీలకే పరిమితం కాకుండా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లకు సైతం విస్తరించింది. అయితే ఐటీ షేర్లు మాత్రం కొంతవరకు నిలకడను ప్రదర్శించాయి.
కళ్లన్నీ జియో లిస్టింగ్‌పైనే
గతవారంలో పబ్లిక్ ఇష్యూ ప్రక్రియ పూర్తి చేసుకున్న రిలయన్స్ జియో బుధవారం (అక్టోబర్ 28న) స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానుంది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా 22.19 రెట్ల ఓవర్ సబ్‌్రస్కిప్షన్ సాధించిన ఈ ఇష్యూ, ప్రాథమిక మార్కెట్‌లో ఇన్వెస్టర్ల నిధులను పెద్ద ఎత్తున ఆకర్షించింది. ఫలితంగా సెకండరీ మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గి సూచీలపై కొంత అమ్మకాల ఒత్తిడికి కారణమైంది. అయితే లిస్టింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఐపీఓలో లాక్ అయిన నిధులు తిరిగి మార్కెట్‌లోకి రానున్నాయి. ఎక్సే్చంజీల్లో జియోకు లభించే స్పందనతో పాటు ఈ నిధుల రాక మార్కెట్‌కు ఊరటనిస్తుందా.. లేక విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల ఒత్తిడే పైచేయి సాధిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.
రూ.48,056 కోట్ల ఉపసంహరణ
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, బలహీన కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, పశ్చిమాసియా అనిశ్చితుల నేపథ్యంలో అక్టోబర్ నెలలో (ఈ నెల 23 నాటికి) విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి రూ.48,056 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. మరోవైపు రూ.30,213 కోట్ల ‘రిలయన్స్ జియో ఐపీఓ’ మార్కెట్ లిక్విడిటీని పెద్ద ఎత్తున ఆకర్షించడంతో సెకండరీ ఈక్విటీలపై ఒత్తిడి మరింత పెరిగింది.
ప్రస్తుత సంవత్సరం(2026)లో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.3.08 లక్షల కోట్లను భారత మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నట్లయింది. గతేడాది (2025) పూర్తి సంవత్సరంలో జరిగిన మొత్తం ఉపసంహరణ (రూ.1.66 లక్షల కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. అయితే, అక్టోబర్‌లో నిధుల తరలింపు భారీగా ఉన్నప్పటికీ.. గత వారంలో ఎఫ్‌పీఐల విక్రయాల తీవ్రత కొంత తగ్గింది. ఈ వారంలో రెండు ట్రేడింగ్ రోజులలో విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా మారడం మార్కెట్‌కు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.


