ఉత్పత్తుల నాణ్యత, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో భారతదేశం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, దీన్ని రెడ్ టేపిజం (అధికారిక ఆలస్యం)గా భావించకూడదని, ఇది దేశ భవిష్యత్తుకు ముందుజాగ్రత్త చర్య అని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. బెర్లిన్‌లో జరిగిన ‘ఇండియా-జర్మనీ బిజినెస్ రౌండ్‌టేబుల్’ సమావేశంలో ఆయన మాట్లాడారు.
సుస్థిర భవిష్యత్తు కోసమే..
యూరప్‌తో పోలిస్తే భారతదేశంలోనే అధికారిక అడ్డంకులు (బ్యూరోక్రసీ) తక్కువగా ఉన్నాయని గోయెల్ వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం వ్యాపార వర్గాల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వ్యవహార శైలిలో వేగవంతమైన మార్పులు తీసుకువస్తోందన్నారు. అయితే, పర్యావరణానికి హాని కలిగించేలా సరైన నివారణ ప్రణాళికలు లేకపోతే అనుమతుల్లో ఆలస్యం తప్పదని హెచ్చరించారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) కూడా మన ఉత్పత్తుల అనుమతుల్లో జాప్యం చేస్తోందని, ఇది రెండు వైపులా జరిగే ప్రక్రియ అని గుర్తుచేశారు.
సీబీఏఎంపై స్పష్టత
ఐరోపా సమాఖ్య ప్రతిపాదించిన కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సీబీఏఎం) ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండదని మంత్రి అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత్ వేగంగా డికార్బనైజేషన్ (కార్బన్ ఉద్గారాల తగ్గింపు) వైపు అడుగులు వేస్తోందని, దీనివల్ల మన పోటీ దేశాలతో పోలిస్తే భారత పరిశ్రమలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరప్‌కు ఎగుమతి చేసే భారతీయ పరిశ్రమలు త్వరగా డికార్బనైజ్ అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల ధ్రువీకరణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
భారత్‌లో పెట్టుబడులకు విదేశీ సంస్థల ఆసక్తి
గత రెండున్నరేళ్లలో జర్మన్ కంపెనీలు భారతదేశంలో 7.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించాయని జర్మనీలోని భారత రాయబారి అజిత్ గుప్తే తెలిపారు. ఆటోమొబైల్, ఫార్మా, ఆటో విడిభాగాలు, పరిశోధన-అభివృద్ధి, టెక్స్‌టైల్స్ రంగాలతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, నౌకా నిర్మాణ రంగాల్లోనూ జర్మన్ దిగ్గజాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని గోయెల్ పేర్కొన్నారు.
యూరోపియన్ యూనియన్ వార్షిక దిగుమతులు 6 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని, అక్కడి కఠిన నిబంధనల వల్ల తయారీ వ్యయం పెరుగుతోందని గోయెల్ విశ్లేషించారు. ఈ క్రమంలో విశ్వసనీయ భాగస్వామి అయిన భారత్ వైపు యూరప్ దృష్టి సారించాలన్నారు. ‘భారతీయ తయారీ సామర్థ్యం, యూరోపియన్ సాంకేతికత’ అనే కాంబినేషన్ వ్యాపార ప్రపంచంలో పెద్దశక్తిగా ఎదుగుతుందని చెప్పారు. ఇరుపక్షాల మధ్య కుదరనున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిలకడైన వ్యాపార అవకాశాలకు, భారత్‌లో భారీ ఉద్యోగ కల్పనకు బాటలు వేస్తుందని ముగించారు.
ఇదీ చదవండి: స్వల్ప వ్యవధిలోనే వెండి రూ.30,000 డౌన్!


