కాలిపోయిన కారు.. 14 ఏళ్లకు జరిగిన న్యాయం! | Man Gets Rs 70 Lakh Insurance Claim Over Punctured BMW | Sakshi
Sakshi News home page

కాలిపోయిన కారు.. 14 ఏళ్లకు జరిగిన న్యాయం!

Oct 13 2026 3:10 PM | Updated on Oct 13 2026 3:30 PM

Man Gets Rs 70 Lakh Insurance Claim Over Punctured BMW

అర్ధరాత్రి.. నిర్మానుష్యమైన హైవేపై, చుట్టుపక్కల ఎక్కడా మెకానిక్ లేని సమయంలో మీ కారు టైరు పంక్చర్ అయిందని ఊహించుకోండి. ఇలాంటి పరిస్థితి మహారాష్ట్రలో రవికాంత్ ఎస్ పాటిల్ అనే వ్యక్తికి ఎదురైంది. అయితే.. ఆయనకు ఎదురైన సమస్య టైరు పంక్చర్‌తోనే ఆగిపోలేదు. చివరకు తన కారును కోల్పోయి, బీమా డబ్బుల కోసం దాదాపు 14 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది.

2012 మార్చి 8వ తేదీన పాటిల్ తన బీఎండబ్ల్యూ కారులో మహారాష్ట్రలోని ధుల్ఖేడ్ సమీపంలో ప్రయాణిస్తుండగా టైరు పంక్చర్ అయింది. రాత్రి సమయం కావడంతో.. అక్కడ మెకానిక్ ఎవరూ అందుబాటులో లేరు. దీంతో ఆయన కారును రోడ్డు పక్కన ఉన్న ఒక డాబా దగ్గర నిలిపి, డోర్ లాక్ చేసి, మరో వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు వచ్చి కారును తీసుకెళ్లాలనుకున్నారు.

కానీ.. మరుసటి రోజు అక్కడికి వెళ్లి చూసేసరికి ఆయన కారు పూర్తిగా కాలిపోయి ఉంది. సుమారు రూ.70 లక్షల విలువైన కారును కోల్పోవడంతో ఆయన బీమా సంస్థను సంప్రదించారు. అయితే.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఆయనకు పరిహారం చెల్లించడానికి నిరాకరించింది. కారును రాత్రంతా అక్కడే వదిలేసి వెళ్లడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, ఇది బీమా పాలసీ నిబంధనలకు విరుద్ధమని సంస్థ వాదించింది.

14 ఏళ్లు కొనసాగిన కేసు
దీంతో పాటిల్ న్యాయం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు దాదాపు 14 సంవత్సరాల పాటు సాగింది. చివరకు కమిషన్ బీమా సంస్థ వాదనను అంగీకరించలేదు. కారు పంక్చర్ అయినప్పుడు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలి వెళ్లకూడదనే నిబంధన బీమా పాలసీలో లేదని స్పష్టం చేసింది.

అంతేకాకుండా.. పాటిల్ కారును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపి, తలుపులు లాక్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారని కమిషన్ గుర్తించింది. కారును అక్కడ వదిలివెళ్లడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని నిరూపించే ఆధారాలు కూడా లేవని పేర్కొంది. ఒక కారును కాపాడుకోవడం కోసం ఎవరూ తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

రూ.70.75 లక్షల పరిహారం
చివరకు బీమా సంస్థ పాటిల్‌కు.. రూ.70 లక్షలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. అంతేకాకుండా.. అతని మానసిక వేదనకు రూ.50,000, న్యాయపోరాట ఖర్చుల కోసం రూ.25,000 అదనంగా చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో వడ్డీని మినహాయించి మొత్తం పరిహారం రూ.70.75 లక్షలకు చేరింది.

ఇదీ చదవండి: ఫ్రెషర్లైనా, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నా.. ఈ స్కిల్స్ ఉంటే ఉద్యోగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement