రుతురాజ్, పృథ్వీ షా (PC: BCCI/MAH Cricket X)
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 సీజన్‌లో ఆంధ్ర జట్టు అద్భుత విజయాలు సాధిస్తోంది. ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా మహారాష్ట్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు గురువారం ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచి.. గ్రూప్ టాపర్‌గా కొనసాగుతోంది.
మారని జట్టు రాత
మరోవైపు.. మహారాష్ట్ర జట్టు వైఫల్యాలు కొనసాగుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టీమిండియాతో పాటు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సమయంలో పృథ్వీ షా మహారాష్ట్ర జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. రుతు తిరిగి వచ్చిన తర్వాత అతడికి పగ్గాలు ఇచ్చినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు.
రుతురాజ్‌పై వేటు!
ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మహారాష్ట్ర జట్టు ఆంధ్ర జట్టు చేతిలో ఓటమితో నాలుగో పరాజయం నమోదు చేసింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ను తుదిజట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు పృథ్వీ షాను కెప్టెన్‌గా నియమించారు. అలాగే మరో సీనియర్ రాహుల్ త్రిపాఠిని సైతం బెంచ్‌కే పరిమితం చేశారు.
వరుస వైఫల్యాలు
కాగా వరుస బ్యాటింగ్ వైఫల్యాల కారణంగానే వీరిద్దరిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రుతురాజ్ నిలకడలేని ఆట తీరుతో జట్టుకు భారంగా మారాడు. నవంబరు 20న అసోంతో మ్యాచ్ సందర్భంగా జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చిన రుతు.. 35 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు.
అయితే, ఆ తర్వాత మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లో 14, త్రిపురతో మ్యాచ్‌లో ఐదు బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మూడు ఇన్నింగ్స్‌లో కలిపి రుతు కేవలం 62 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో ఆంధ్రతో మ్యాచ్‌లో అతడు బెంచ్‌కే పరిమితం కావడం గమనార్హం.
పృథ్వీ షా డకౌట్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొహాలీ వేదికగా టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ పృథ్వీ షా డకౌట్ కాగా.. సాహిల్ పరేఖ్ (7 బంతుల్లో 20) వేగంగా ఆడే ప్రయత్నంలో త్వరగానే పెవిలియన్ చేరాడు.
మిగిలిన వారిలో రుషికేశ్ సొనావనే (28 బంతుల్లో 30) ఫర్వాలేదనిపించగా.. అర్షిన్ కులకర్ణి అర్ధ శతకం (37 బంతుల్లో 56)తో ఆకట్టుకున్నాడు. సిద్ధేశ్ వీర్ (25 బంతుల్లో 32) ఓ మోస్తరుగా రాణించగా.. రంజీత్ నికమ్ మెరుపులు (18 బంతుల్లో 33 నాటౌట్) మెరిపించాడు.
ఫలితంతగా మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగలిగింది. ఆంధ్ర బౌలర్లలో కేఎస్ నరసింహ రాజు మూడు వికెట్లు తీయగా.. సత్యనారాయణ రాజు రెండు, బైలపూడి యశ్వంత్, కేవీ శశికాంత్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆంధ్ర ఘన విజయం
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆంధ్ర జట్టు 19.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 181 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసింది. ఓపెనర్లు షేక్ రషీద్ (43 బంతుల్లో 53), మారంరెడ్డి హేమంత్ రెడ్డి (35 బంతుల్లో 64) అర్ధ శతకాలతో అదరగొట్టారు.
కెప్టెన్ రికీ భుయ్ (15 బంతుల్లో 13) విఫలం కాగా.. అశ్విన్ హెబ్బర్ (17 బంతుల్లో 34), ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ (6 బంతుల్లో 12) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. మహారాష్ట్ర బౌలర్లలో సిద్దేశ్ వీర్ రెండు వికెట్లు దక్కించుకోగా.. ముకేశ్ చౌదరి ఒక వికెట్ పడగొట్టాడు.
నేను విశ్రాంతి తీసుకుంటున్నా!
ఆంధ్రతో మ్యాచ్ నుంచి తనను తప్పించారన్న వార్తల నేపథ్యంలో రుతురాజ్ గైక్వాగ్ ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. స్విమింగ్ పూల్‌లో కూర్చుని ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో పంచుకున్న రుతు.. ‘‘నేనేమీ చేయలేను. విశ్రాంతి తీసుకోవడంలో నేను బిజీగా ఉన్నాను’’ అని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: శతక్కొట్టిన ఓపెనర్.. సంజూ మెరుపులు


