బ్లింకిట్‌కు రూ.11 లక్షల ఫైన్‌.. జెప్టో, బిగ్‌బాస్కెట్‌ లైసెన్సుల రద్దు | FDA Crackdown Fine on Blinkit Zepto BigBasket Licences Suspended | Sakshi
Sakshi News home page

బ్లింకిట్‌కు రూ.11 లక్షల ఫైన్‌.. జెప్టో, బిగ్‌బాస్కెట్‌ లైసెన్సుల రద్దు

Nov 26 2026 9:15 PM | Updated on Nov 26 2026 9:19 PM

FDA Crackdown Fine on Blinkit Zepto BigBasket Licences Suspended

నిమిషాల్లోనే నిత్యావసరాలు అందిస్తామంటూ దూసుకుపోతున్న క్విక్‌ కామర్స్‌ సంస్థల డార్క్‌ స్టోర్లలో ఆహార భద్రత డొల్లతనం బట్టబయలైంది. కనీస పరిశుభ్రత పాటించకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడంపై మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) కఠిన చర్యలు చేపట్టింది. అమరావతిలోని బ్లింకిట్‌ స్టోర్‌కు రూ.11 లక్షల జరిమానా విధించగా, ముంబైలోని జెప్టో, నవీ ముంబైలోని బిగ్‌బాస్కెట్‌ కేంద్రాల ఆహార వ్యాపార లైసెన్సులను తక్షణమే సస్పెండ్‌ చేసింది.

బ్లింకిట్‌పై జరిమానా

అమరావతి రాఠీ నగర్‌లోని బ్లింకిట్‌ స్టోర్‌ ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006 (సెక్షన్‌ 31) ప్రకారం కనీస లైసెన్సు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసినందుకు రూ.లక్ష, లైసెన్సు లేని వ్యాపారానికి రూ.10 లక్షలు కలిపి సంస్థ మేనేజర్‌, నలుగురు డైరెక్టర్లపై జాయింట్‌ కమిషనర్‌ రూ.11 లక్షల పెనాల్టీ విధించారు.

జెప్టో స్టోర్‌లో బొద్దింకల సంచారం

అంధేరీ (తూర్పు) సాకీ విహార్‌ రోడ్డులోని జెప్టో డార్క్‌ స్టోర్‌లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో అపరిశుభ్రత వెలుగుచూసింది. సరుకుల ర్యాక్‌లపై బొద్దింకలు తిరగడం, గడువు ముగిసిన సరుకును విక్రయయోగ్యమైన వాటితో కలిపి ఉంచడం, ఫ్రీజర్లలో నిర్దేశిత ఉష్ణోగ్రతలు లేకపోవడం, శాకాహార–మాంసాహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేయకపోవడంతో లైసెన్సును నిలిపివేశారు.

బిగ్‌బాస్కెట్‌లో ఎలుకల బెడద

నవీ ముంబై నేరుల్‌లోని బిగ్‌బాస్కెట్‌ (ఇన్నోవేటివ్‌ రిటైల్‌ కాన్సెప్ట్స్‌) గిడ్డంగి తనిఖీల్లో ఎలుకలు కొరికిన వంటనూనె ప్యాకెట్లు, ఆహారంతో పాటు సిగరెట్ల విక్రయం, పెట్‌ ఫుడ్‌ కలిపి నిల్వ చేయడం, 34 మంది సిబ్బందికి వైద్య ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. దెబ్బతిన్న సరుకును 72 గంటల్లో నాశనం చేయాలని, సిగరెట్లు తొలగించాలని ఆదేశిస్తూ లైసెన్సు సస్పెండ్‌ చేశారు. యాలకుల నమూనాలను ల్యాబ్‌కు పంపి ఆ బ్యాచ్‌ విక్రయాలను నిలిపివేశారు.

సరిదిద్దుకునే అవకాశం

సస్పెన్షన్‌ తుది రద్దు కాదని, బిగ్‌బాస్కెట్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చామని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. 15 రోజుల్లో వివరణ ఇచ్చి లోపాలు సవరించుకుంటే 14 రోజుల తర్వాత మళ్లీ తనిఖీ చేసి లైసెన్సు పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటారు. వేగవంతమైన డెలివరీతో పాటు ప్రజారోగ్యానికీ అంతే ప్రాధాన్యమివ్వాలని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: మాటలతో తేలేలాలేదు.. హైకోర్టులో దావా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement