రెంటల్ హౌసింగ్‌ను ప్రోత్సహించాలి
యువతకు ఉపాధి పెంచాలి
ఆర్థిక మంత్రితో ప్రీ–బడ్జెట్ సమావేశంలో సూచనలు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి పరిశ్రమ వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రీ–బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. వీటిలో 13 రంగాల నుంచి పాల్గొన్న దాదాపు 200 మంది ప్రతినిధులు పలు సూచనలు చేశారు. పరిశ్రమను బట్టి నిర్దిష్ట కృత్రిమ మేధ (ఏఐ) మోడల్స్‌ను రూపొందించడం, అందుబాటు ధరల్లో నివాసాల లభ్యతను పెంచే దిశగా రెంటల్ హౌసింగ్‌ను ప్రోత్సహించడం, ద్వితీయ–తృతీయ నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవకాశాలను పెంచడం మొదలైనవి వీటిలో ఉన్నాయి.
అలాగే, దేశీయంగా బయో–ఫెర్టిలైజర్లు, అధునాతన బయోటెక్నాలజీ ఆధారిత వ్యవసాయ ముడి ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలని, వ్యవసాయేతర ఉపాధి వైపు గ్రామీణ యువతను మళ్లించేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని, బాలలందరూ 5వ గ్రేడ్ వచ్చేసరికి వార్తాపత్రికను చదివి, అర్థం చేసుకోగలిగేలా జాతీయ స్థాయిలో రీడింగ్ ఉద్యమాన్ని చేపట్టాలని పరిశ్రమ వర్గాలు సూచించాయి. ఈ ఏడాది వినూత్నంగా యువ ప్రతినిధులతో కూడా సమావేశం జరిగినట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2027–28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడతారు.


