breaking news
Industry representatives
-
ముగిసిన సంబురం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఐటీ సమ్మేళన సంబురం ముగిసింది. రాష్ట్ర పారిశ్రామిక యవనికపై ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలియెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్ బుధవారం ఘనంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యం.. ప్రపంచ ఐటీ పరిశ్రమల సీఈఓలు, ఎగ్జిక్యూటివ్‌లు, మేధావులను సమ్మోహనపరిచింది. పరిశ్రమల ఒలంపిక్స్‌గా పేరుగాంచిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌కు 40 ఏళ్ల చరిత్ర ఉండగా, 22వ సదస్సును దేశంలో నిర్వహించారు. గత సదస్సులతో పోల్చితే ఈసారి అత్యధిక మంది ఐటీ రంగ ప్రతినిధులు హాజరయ్యారని, అత్యంత ఘనంగా నిర్వహించారని సదస్సు ముగింపు కార్యక్రమంలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడుతూ, సదస్సు విజయవంతానికి కృషి చేసిన డబ్ల్యూఐటీఎస్‌ఏ, నాస్కామ్ ప్రతినిధి బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేసిన పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు కూడా ఐటీ రంగంలో వృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అర్మేనియాలో తదుపరి సదస్సు వచ్చే ఏడాది అక్టోబర్ 6వ తేదీ నుంచి 9 వరకు అర్మేనియాలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ 23వ సదస్సును నిర్వహిస్తామని డబ్ల్యూఐటీఎస్‌ఏ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ఐటీ, పరిశ్రమల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బాటన్‌ను అందుకున్నారు. కార్యక్రమంలో డబ్ల్యూఐటీఎస్‌ఏ చైర్మన్ ఇవాన్ చియు, ప్రధాన కార్యదర్శి జిమ్ పైసంట్, నాస్కామ్ చైర్మన్ రమణ్ రాయ్, అధ్యక్షులు ఆర్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు 30 దేశాల నుంచి ఐటీ రంగానికి చెందిన 2 వేల మంది దార్శనికులు, పరిశ్రమలు, ప్రభుత్వాల సారథులు, విద్యావేత్తలు హాజరయ్యారు. టాప్ 500 ఐటీ కంపెనీల నుంచి కనీసం 20 మంది సీఈఓలు, మరో 100 మంది ఎగ్జిక్యూటివ్‌లు వీరిలో ఉన్నారు. ఈ సదస్సులో 50కి పైగా చర్చాగోష్టిలు (సెషన్లు), మరో 50కి పైగా అత్యాధునిక ఐటీ రంగ ఉత్పత్తులపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈనెల 20న మానవ రూప రోబో సోఫియా చేసిన ప్రసంగం, ఇంటర్వ్యూ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తైవాన్‌తో ఒప్పందం సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు తైవాన్‌లోని టాయుఆన్ (Taoyuan) నగరంతో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. పెట్టుబడులను ఆకట్టుకోవడం, పరిపాలనలో సాంకేతిక సహకారం, సార్టప్‌లకు మద్దతు, విద్యా సంస్థలతో ఒప్పందాలు, అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులపై ప్రదర్శనల ఏర్పాటు విషయంలో పరస్పర సహకారం కోసం మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. -
వినూత్న విధానాలతో ముందుకు!
సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులతో ప్రధాని భేటీ... - పారిశ్రామిక రంగం కష్టాలపై దృష్టి - సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ... న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాణిజ్య కార్యకలాపాల నిర్వహణలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వినూత్న రీతి ఆలోచనలతో ముందుకు పోవాలని సూచించారు. తయారీ రంగం వృద్ధే లక్ష్యంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతానికి సంయుక్త కృషి జరగాలని పిలుపునిచ్చారు. రెండు ప్రముఖ పారిశ్రామిక సంఘాలు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), భారత వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) ప్రతినిధులతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. గత ఏడాది అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోడీ ఈ తరహా భేటీ ఇదే తొలిసారి. మూలధన వ్యయాలు పెరగడం నుంచి సంక్లిష్ట పన్ను అంశాల వరకూ పారిశ్రామిక ప్రతినిధులు నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఫిక్కీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన మంత్రి కార్యాలయం సైతం ఈ చర్చలపై ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం... - అధిక మూలధన వ్యయాలు, రుణ సమీకరణలో వడ్డీల భారం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందుల వల్ల దేశంలో పెట్టుబడులు ఊపందుకోవడం లేదని పారిశ్రామిక వేత్తలు పేర్కొన్నారు. - చమురు, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలకు సంబంధించి దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితిని తగ్గించడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని మోడీ హామీ. అలాగే పలు ప్రాజెక్టుల పురోగతిపై దృష్టి పెడుతుందని తెలిపారు. - విశ్వాసం, విధానాల్లో సంక్లిష్టతలను తొలగించడం, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాల్లో మరింత ముందడుగు అవసరమని ప్రధాని సూచించారు. - కార్పొరేట్ బాధ్యతల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అంశాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. - వ్యవసాయ ఉత్పత్తులు, జౌళి, రక్షణ సంబంధ తయారీ రంగం మరింత అభివృద్ధి సాధించాలి. నిరాశాజనక పరిస్థితి: మూడీస్ ఇదిలావుండగా, అంతర్జాతీయ రేటింగ్ దిగ్జజ సంస్థ మూడీస్... దేశంలో సంస్కరణల తీరు పట్ల నిరుత్సాహం నెలకొన్నట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. ‘ఇన్సైడ్ ఇండియా’ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో మూడీస్ ప్రత్యేకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నిరుత్సాహ ధోరణులను ప్రస్తావించింది. భారత్ సావరిన్ రేటింగ్‌కు సంబంధించి ఇది ‘క్రెడిట్ నెగిటివ్’ అని వివరించింది. విధాన ప్రతిష్టంభనపై ఆందోళనలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.5 శాతంగా మూడీస్ అంచనావేస్తోంది.