ముగిసిన సంబురం

World IT Congress was ended grandly after three days of celebration - Sakshi

     3 రోజులముగిసిన సంబురంపాటు ఘనంగా జరిగిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ 

     ఆతిథ్యంతో ఐటీ ప్రపంచాన్ని ఆకట్టుకున్న భాగ్యనగరం 

     ఐటీలో అభివృద్ధి కొనసాగుతుంది... విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్‌ 

     అర్మేనియాలో వచ్చే ఏడాది ఐటీ కాంగ్రెస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ఐటీ సమ్మేళన సంబురం ముగిసింది. రాష్ట్ర పారిశ్రామిక యవనికపై ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. వరల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ అలియెన్స్‌ (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ బుధవారం ఘనంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యం.. ప్రపంచ ఐటీ పరిశ్రమల సీఈఓలు, ఎగ్జిక్యూటివ్‌లు, మేధావులను సమ్మోహనపరిచింది. పరిశ్రమల ఒలంపిక్స్‌గా పేరుగాంచిన వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌కు 40 ఏళ్ల చరిత్ర ఉండగా, 22వ సదస్సును దేశంలో నిర్వహించారు. గత సదస్సులతో పోల్చితే ఈసారి అత్యధిక మంది ఐటీ రంగ ప్రతినిధులు హాజరయ్యారని, అత్యంత ఘనంగా నిర్వహించారని సదస్సు ముగింపు కార్యక్రమంలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడుతూ, సదస్సు విజయవంతానికి కృషి చేసిన డబ్ల్యూఐటీఎస్‌ఏ, నాస్కామ్‌ ప్రతినిధి బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేసిన పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు కూడా ఐటీ రంగంలో వృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

అర్మేనియాలో తదుపరి సదస్సు 
వచ్చే ఏడాది అక్టోబర్‌ 6వ తేదీ నుంచి 9 వరకు అర్మేనియాలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ 23వ సదస్సును నిర్వహిస్తామని డబ్ల్యూఐటీఎస్‌ఏ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ఐటీ, పరిశ్రమల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా బాటన్‌ను అందుకున్నారు. కార్యక్రమంలో డబ్ల్యూఐటీఎస్‌ఏ చైర్మన్‌ ఇవాన్‌ చియు, ప్రధాన కార్యదర్శి జిమ్‌ పైసంట్, నాస్కామ్‌ చైర్మన్‌ రమణ్‌ రాయ్, అధ్యక్షులు ఆర్‌.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు 30 దేశాల నుంచి ఐటీ రంగానికి చెందిన 2 వేల మంది దార్శనికులు, పరిశ్రమలు, ప్రభుత్వాల సారథులు, విద్యావేత్తలు హాజరయ్యారు. టాప్‌ 500 ఐటీ కంపెనీల నుంచి కనీసం 20 మంది సీఈఓలు, మరో 100 మంది ఎగ్జిక్యూటివ్‌లు వీరిలో ఉన్నారు. ఈ సదస్సులో 50కి పైగా చర్చాగోష్టిలు (సెషన్లు), మరో 50కి పైగా అత్యాధునిక ఐటీ రంగ ఉత్పత్తులపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈనెల 20న మానవ రూప రోబో సోఫియా చేసిన ప్రసంగం, ఇంటర్వ్యూ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

తైవాన్‌తో ఒప్పందం 
సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు తైవాన్‌లోని టాయుఆన్‌ (Taoyuan) నగరంతో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. పెట్టుబడులను ఆకట్టుకోవడం, పరిపాలనలో సాంకేతిక సహకారం, సార్టప్‌లకు మద్దతు, విద్యా సంస్థలతో ఒప్పందాలు, అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులపై ప్రదర్శనల ఏర్పాటు విషయంలో పరస్పర సహకారం కోసం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top