తైవాన్ చుట్టూ చైనా సైనిక ఉనికి మరింత పెరుగుతోంది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల వరకు తైవాన్ ప్రాదేశిక జలాల సమీపంలో 26 చైనా సైనిక విమానాలు, ఎనిమిది నావికాదళ నౌకలు, ఒక ప్రభుత్వ నౌకను గుర్తించారు.
ఈ 26 విమానాల్లో ఏడు విమానాలు సెంట్రల్ లైన్‌ను దాటి తైవాన్ ఉత్తర, మధ్య, నైరుతి ఎయిర్ డిఫెన్స్ జోన్‌లలోకి ప్రవేశించాయి. ఇదే సమయంలో, చైనా సైన్యానికి చెందిన ఒక నిఘా మానవరహిత వైమానిక వాహనం (డ్రోన్) కూడా తైవాన్ నైరుతి రక్షణ జోన్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.
తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ రేడియో హెచ్చరికలు జారీ చేసిన అనంతరం, ఆ డ్రోన్ సంఘటనా స్థలం నుంచి వెనక్కి వెళ్లిందని పేర్కొంది. ఈ డ్రోన్ తైవాన్ నియంత్రణలో ఉన్న ప్రాటాస్ దీవుల మీదుగా ఎగిరినట్లు వెల్లడించింది. ఈ చర్యను తైవాన్ రక్షణ శాఖ రెచ్చగొట్టే, బాధ్యతారాహిత్య చర్యగా అభివర్ణించింది.
శుక్రవారం కూడా తైవాన్ చుట్టూ చైనా సైనిక కదలికలు తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు మొత్తం 34 చైనా విమానాలు, 11 నౌకలు గుర్తించినట్లు జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ నివేదించింది. వీటిలో 18 విమానాలు సెంటర్ లైన్‌ను దాటి తైవాన్ ఉత్తర, మధ్య, నైరుతి, తూర్పు ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ADIZ)లోకి ప్రవేశించాయని పేర్కొంది.
చైనా సైనిక చర్యల నేపథ్యంలో తైవాన్ భద్రతాపరమైన పరిస్థితులపై ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.


