తైపీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ టె స్పష్టం చేశారు. ఆ దేశం చుట్టూ చైనా ఇటీవల లైవ్–ఫైర్ సైనిక కసరత్తలు చేపట్టిన నేపథ్యంలో గురువారం కొత్త సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా విస్తరణవాద కాంక్ష నేపథ్యంలో, తైవాన్ ప్రజలకు తమను తాము రక్షించుకునే శక్తి ఉందో, లేదోనని అంతర్జాతీయ సమాజం చూస్తోందన్నారు.
జాతీయ రక్షణ, సమాజాన్ని కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సమగ్రమైన రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై అధ్యక్షుడిగా తన వైఖరి స్పష్టమన్నారు. ఒకప్పుడు జపాన్ కాలనీగా ఉన్న తైవాన్ 1949లో చైనాతో జరిగిన అంతర్యుద్ధంలో ఓడిపోవడంతో స్వతంత్ర పాలనలో ఉంది. అయితే చైనా మాత్రం తైవాన్‌ను తన సొంత భూభాగంగా చూస్తుంది. అవసరమైతే దానిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని పదేపదే బెదిరిస్తుంది. ఈ నేపథ్యంలో లై వ్యాఖ్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అధ్యక్షుడు లై, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఎన్ని చెప్పినా, ఏం చేసినా.. తైవాన్ చైనాలో భాగమనే వాస్తవాన్ని వారు మార్చలేరని తెలిపింది. తైవాన్‌పై చైనా దాడి చేస్తే టోక్యో జోక్యం చేసుకుంటుందని జపాన్ చేసిన వ్యాఖ్యలు, యూఎస్ ఆయుధ విక్రయాలపై చైనా కొత్త నాయకుడి వ్యాఖ్యలపై బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ విలీనాన్ని ఎవ్వరూ ఆపలేరని తాజాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా వ్యాఖ్యానించారు.


