బంగారంలో కొత్త తరహా కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా బంగారంలో రాగి, వెండిని కలపడం తెలిసిందే. కానీ ఇప్పుడు అత్యంత సాంద్రత కలిగిన ‘రీనియం’అనే లోహపు పొడిని బంగారంలో కలుపుతూ భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కల్తీ ఎంత ప్రమాదకరంగా ఉందంటే స్వచ్ఛతను పరీక్షించే ఆధునిక యంత్రాలు, హాల్‌మార్కింగ్ కేంద్రాలు సైతం గుర్తించలేకపోతున్నాయి.
మూలాలు చైనాలో!
ఇటీవల జరిగిన పరిశోధనాత్మక విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ మూలాలు చైనాలో ఉన్నాయి. బంగారం బరువును పెంచడానికి ఉపయోగించే ఈ రీనియం పొడి చైనాలోని షెన్‌జెన్ ప్రాంతంలో తయారవుతోంది. ముంబై, పశ్చిమ బెంగాల్ ద్వారా భారత మార్కెట్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. విచారణలో పాల్గొన్న బృందం ముంబైకి చెందిన ఒక ఏజెంట్ ద్వారా 5,000 రూపాయలు చెల్లించి ఒక గ్రాము రీనియం పొడిని కొనుగోలు చేసింది. దీనిని 7.83 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో కలిపి, రాజస్తాన్‌లోని జో«ద్‌పూర్‌లో ఒక ఆభరణాన్ని తయారు చేయించారు.
హాల్‌మార్కింగ్ కేంద్రానికే టోకరా!
రీనియం కలిపిన బంగారంతో చేసిన ఆభరణాన్ని వివిధ షోరూమ్‌లు, హాల్‌మార్కింగ్ కేంద్రాలలో పరీక్షించగా, అక్కడి యంత్రాలు ఇందులో రీనియం ఉన్నట్లు గుర్తించలేకపోయాయి. అంతేకాకుండా, ఒక హాల్‌మార్కింగ్ కేంద్రం దీనికి 22 క్యారెట్ల (92కే 916) హాల్‌మార్క్ ముద్రను కూడా జారీ చేసింది.
సాధారణ పరీక్షలకు ఎందుకు దొరకడం లేదంటే రీనియం, ఇరిడియం, ఓస్మియం వంటి లోహాల సాంద్రత బంగారం కంటే ఎక్కువగానూ, దాదాపు సమానంగానూ ఉంటుంది. దీనివల్ల బంగారంలో ఈ పొడిని 25 శాతం వరకు కలిపినా కూడా బరువులో గానీ, ఆకారంలో గానీ ఎలాంటి తేడా కనిపించదు.
సాంప్రదాయ యాసిడ్ పరీక్షలు, గీటురాయి పరీక్షలలో కూడా ఈ కల్తీ బయటపడదు. సాధారణ షోరూమ్‌లలో ఉండే ఎక్స్–రే ఫ్లోరోసెస్ యంత్రాలు కేవలం లోహం పైపొరను మాత్రమే విశ్లేషిస్తాయి. సరైన కాలిబ్రేషన్ లేకపోవడం వల్ల లోపల ఉన్న రీనియం వంటి లోహాలను ఇవి గుర్తించలేకపోతున్నాయి.
వినియోగదారులపై ప్రభావం – జాగ్రత్తలు!
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, ఇలాంటి కల్తీ బంగారం మార్కెట్లోకి రావడం వల్ల సామాన్య కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కరిగించినప్పుడు మాత్రమే అసలు బంగారం శాతం తక్కువగా ఉందని తెలుస్తుంది.
పేరున్న, నమ్మకమైన ఆభరణాల విక్రయదారుల వద్ద మాత్రమే బంగారం కొనుగోలు చేయాలి.
ఆభరణంపై బీఐఎస్ లోగోతో పాటు 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్) నంబర్ సరిచూసుకోవాలి.
బీఐఎస్ కేర్ యాప్ ద్వారా ఆ నంబర్‌ను తనిఖీ చేయవచ్చు
కొనుగోలు చేసిన ప్రతి గ్రాముకు సంబంధించి స్పష్టమైన పక్కా బిల్లు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే చట్టపరంగా పోరాడే అవకాశం ఉంటుంది.
బంగారం స్వచ్ఛతపై అనుమానం వస్తే అధునాతనమైన ఎక్స్‌ఆర్‌ఎఫ్ విశ్లేషణ లేదా ఫైర్ అస్సే వంటి లోతైన పరీక్షలు నిర్వహించే బీఐఎస్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లను సంప్రదించాలి.


