జర్మనీకి చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఎస్‌ఏపీ (SAP) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత వ్యాపార కార్యకలాపాలపై దృష్టి సారిస్తూ కనీసం 10,000 ఉద్యోగాలను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించాయి. ఈ కోతలు అమలైతే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో కనీసం 9 శాతం మంది ప్రభావితమయ్యే అవకాశముంది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఉద్యోగుల ప్రతినిధులతో ఇంకా చర్చలు ప్రారంభం కాలేదని సమాచారం. కార్మిక సంఘాలతో సంప్రదింపుల అనంతరం తొలగింపుల సంఖ్యలో మార్పులు ఉండవచ్చు. ఉద్యోగాల కోతలపై ఎస్‌ఏపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సంస్థ తన వ్యాపార వ్యూహాలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సంస్థాగత నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుందని మాత్రమే వెల్లడించింది.
ఏఐపై పెరుగుతున్న దృష్టి
ఎస్‌ఏపీ సీఈఓ క్రిస్టియన్ క్లైన్ సంస్థను ఏఐ ఆధారిత వ్యాపార నమూనా వైపు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల అభివృద్ధి, విక్రయ విధానాలను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్పత్తుల అభివృద్ధి, ఇంజినీరింగ్, విక్రయ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను సమీక్షిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటికే వివిధ విభాగాలు ఖర్చులను తగ్గించుకునేందుకు, పనితీరును మెరుగుపరిచేందుకు అవకాశాలను గుర్తించాలని యాజమాన్యం సూచించినట్లు సమాచారం.
ఇప్పటికే 10 వేల ఉద్యోగాల కోత
ఎస్‌ఏపీకి ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. 2024లోనూ సంస్థ సుమారు 10 వేల ఉద్యోగాలను ప్రభావితం చేసే పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందుకోసం దాదాపు 300 కోట్ల యూరోలు ఖర్చు చేసింది. అయితే స్వచ్ఛంద పదవీ విరమణలు, ఉద్యోగులకు తిరిగి శిక్షణ ఇవ్వడం వంటి చర్యలతో పాటు కొత్త నియామకాలు చేపట్టడంతో ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్య మళ్లీ పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.10 లక్షలకు పైగా ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. జర్మనీలోని ఉద్యోగులకు 2028 వరకు ఉపాధి భద్రత కల్పించేలా కార్మిక ప్రతినిధులతో ఒప్పందం కూడా కుదిరింది.
ఇదీ చదవండి: వచ్చే కొత్త టెక్నాలజీలో.. 2 లక్షల ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు!


