రూ. 6.5 కోట్ల సెటిల్మెంట్ ప్రణాళికపై స్టే విధించిన ఎన్‌సీఎల్‌టీ
ఆస్తులను బదిలీ చేయకుండా నిషేధం
న్యూఢిల్లీ: జీ/ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీలో చుక్కెదురైంది. రూ. 22,006 కోట్ల రుణదాతల బకాయి క్లెయిమ్‌లకు గాను సుమారు రూ. 6.5 కోట్లతో సెటిల్మెంట్ చేసుకునేందుకు ఇటీవల ఆమోదించిన సెటిల్మెంట్ ప్రణాళికపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) స్టే విధించింది. అంతేకాకుండా తన వ్యక్తిగత గ్యారంటీలకు సంబంధించిన దివాలా కేసులో ఆస్తులను బదిలీ చేయకుండా నిషేధం విధించింది. ఎన్‌సీఎల్‌టీ ప్రెసిడెంట్ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.
‘కంపెనీల చట్టంలోని సెక్షన్ 419 (5) ప్రకారం రీపేమెంట్ ప్రణాళికను అమలు చేయడానికి స్పష్టమైన మెజారిటీ అభిప్రాయం లేనందున గత తీర్పు అమల్లోకి రాదు. కాబట్టి, ఈ ఏడాది ఆగస్ట్ 25న ఎన్‌సీఎల్‌టీ మూడో మెంబర్ (జ్యుడీషియల్) ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నాం’ అని బెంచ్ పేర్కొంది. ‘వ్యక్తిగత గ్యారంటార్‌గా ఉన్న చంద్ర తన ఆస్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరికీ కట్టబెట్టకూడదు’ అని ట్రిబ్యునల్ ఆదేశించింది.
అలాగే, ఈ కేసులో అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసింది. ఎల్‌ఐసీ హౌసింగ్ పైనాన్స్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ సహా రీపేమెంట్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తున్న రుణదాతల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్టే ఇవ్వాల్సిందిగా కోరారు. కాగా, చంద్రతో పాటు రుణదాతల వాదనలను పూర్తి స్థాయిలో ట్రిబ్యునల్ విచారిస్తుందని జస్టిస్ గ్రేవాల్ పేర్కొన్నారు. తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది. మరోపక్క, రుణదాతలు ఎన్‌సీఎల్‌టీ రీపేమెంట్ ప్రణాళికను ఆమోదిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)ని ఆశ్రయించారు.


