ప్రముఖ లగ్జరీ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటొరాడ్ భారత మార్కెట్లో.. కొత్త ఎం 1000 ఆర్ఆర్ సూపర్ బైక్‌ను లాంచ్ చేసింది. రేసింగ్ బైక్‌లను ఇష్టపడేవారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.59.90 లక్షలు.
కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ బైక్.. మునుపటి మోడల్ కంటే ఎక్కువ అప్డేట్స్ పొందింది. ఇందులోని 999 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్.. 14500 ఆర్పీఎం వద్ద 215 బీహెచ్పీ పవర్, 11100 ఆర్పీఎం వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. కొత్త థ్రాటిల్ సిస్టమ్ వల్ల రైడర్ తక్కువ చేతి కదలికతోనే పూర్తి యాక్సిలరేషన్ పొందవచ్చు.
డిజైన్ పరంగా కూడా కొత్త బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ మరింత స్పోర్టీగా కనిపిస్తుంది. ముఖ్యంగా ముందు భాగంలో కొత్త ఎం వింగ్లెట్స్ 3.0ను అందించారు. ఇవి కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారయ్యాయి. అధిక వేగంతో వెళ్లేటప్పుడు.. బైక్ ముందు భాగం గాల్లోకి లేవకుండా స్థిరంగా ఉండటానికి ఇవి సహాయపడతాయి. అలాగే.. ఫ్రేమ్‌లో కొన్ని మార్పులు చేసి, మలుపులు తీసుకునేటప్పుడు బైక్ మరింత మెరుగ్గా స్పందించేలా రూపొందించారు. రేసింగ్ సమయంలో ఈ మార్పులు రైడర్‌కు ఉపయోగపడతాయని కంపెనీ చెబుతోంది.
ఫీచర్ల విషయానికి వస్తే ఈ బైక్‌లో డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ మాత్రమే కాకుండా.. కొత్త సైడ్ కంట్రోల్ సిస్టమ్‌ను అందించారు. కంపెనీ ఈ బైక్ కోసం మూడేళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. కావాలనుకునే కస్టమర్లు నాలుగు, ఐదో సంవత్సరాలకు కూడా వారంటీని పొడిగించుకోవచ్చు. 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.


