బజాజ్ కొత్త పల్సర్ బైక్‌ లాంచ్‌.. ధర ఎంతంటే? | New Bajaj Pulsar RS200 launched Rs 1 98 lakh India | Sakshi
Sakshi News home page

బజాజ్ కొత్త పల్సర్ బైక్‌ లాంచ్‌.. ధర ఎంతంటే?

Nov 21 2026 6:15 PM | Updated on Nov 21 2026 6:20 PM

New Bajaj Pulsar RS200 launched Rs 1 98 lakh India

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తన స్పోర్ట్స్ బైక్ పల్సర్ RS200ను సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.1,98,441గా నిర్ణయించింది. గత మోడల్‌తో పోలిస్తే ధర రూ.16,773 పెరిగింది. అయితే ఈసారి కేవలం డిజైన్‌లో మార్పులకు మాత్రమే పరిమితం కాకుండా, అధునాతన ఎలక్ట్రానిక్స్‌, సస్పెన్షన్‌, డిస్‌ప్లే వంటి కీలక అప్‌గ్రేడ్స్‌ను అందించింది.

మరింత పవర్‌ఫుల్‌ ఇంజిన్ 

కొత్త పల్సర్ RS200లో 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు. అయితే దీని గరిష్ఠ శక్తిని 24.5 PS నుంచి 25.5 PSకు పెంచారు. 10,000 ఆర్‌పీఎం వద్ద గరిష్ఠ శక్తిని అందిస్తుంది. టార్క్ మాత్రం 18.7 Nm వద్ద యథాతథంగా ఉంది.

ఈ బైక్‌లో తీసుకొచ్చిన ప్రధాన మార్పుల్లో ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ (ETB) ఒకటి. దీని ద్వారా రైడర్ అవసరాలకు అనుగుణంగా థ్రాటిల్ స్పందనను నియంత్రించుకోవచ్చు. స్పోర్ట్, రోడ్, రెయిన్, ఆఫ్‌రోడ్, టూర్.. ఇలా ఐదు రైడింగ్ మోడ్స్‌ను అందించారు. వేగం పెంచే సమయంలో వెనుక చక్రం జారిపోకుండా నియంత్రించేందుకు ట్రాక్షన్ కంట్రోల్ సదుపాయాన్ని కూడా జోడించారు. స్పోర్ట్స్ షిఫ్టర్ పేరుతో బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను అందించారు. దీంతో క్లచ్ ఉపయోగించకుండానే గేర్లను పైకి, కిందికి మార్చుకోవచ్చు.

సస్పెన్షన్‌, డిస్‌ప్లేలో మార్పులు

పాత మోడల్‌లోని టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ స్థానంలో 37 మి.మీ. అప్‌సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్‌ను అమర్చారు. వెనుకవైపు 140/70-R17 రేడియల్ టైర్‌ను అందించారు. ఇవి బైక్ హ్యాండ్లింగ్‌, మలుపుల్లో స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇక బైక్ ముందు భాగంలోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లోనూ మార్పులు చేశారు. పాత కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే స్థానంలో 5 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్‌ను తీసుకొచ్చారు. గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ ద్వారా నావిగేషన్ వివరాలను ఈ స్క్రీన్‌పై చూసుకోవచ్చు. అదనంగా యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌, అడ్జస్టబుల్ హ్యాండ్ లీవర్లు, హజార్డ్ లైట్లు, పానిక్ బ్రేక్ అలర్ట్ వంటి సదుపాయాలను జోడించారు.

ధరల విషయానికొస్తే.. కొత్త పల్సర్ RS200 రూ.1.98 లక్షల ధరతో 200 సీసీ స్పోర్ట్స్ బైక్ విభాగంలోకి వచ్చింది. ఇది హీరో కరిజ్మా XMR కంటే ఎక్కువ ధరలో ఉండగా, KTM RC 200 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అధునాతన రైడింగ్ ఫీచర్లు, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, మెరుగైన సస్పెన్షన్‌తో ఈ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని బజాజ్ ఆటో భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement