స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రూ.2 కోట్ల భారీ జరిమానా | Star Health 2 crore penalty IRDAI over claim settlement lapses | Sakshi
Sakshi News home page

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రూ.2 కోట్ల భారీ జరిమానా

Nov 21 2026 5:03 PM | Updated on Nov 21 2026 5:07 PM

Star Health 2 crore penalty IRDAI over claim settlement lapses

హెల్త్ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ల పరిష్కారంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రముఖ బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) రూ.2 కోట్ల భారీ జరిమానా విధించింది. కోవిడ్‌-19 సహా పలు ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను సరైన కారణాలు లేకుండా తిరస్కరించడం, పాలసీ నిబంధనలకు విరుద్ధంగా క్లెయిమ్‌ మొత్తాల్లో కోతలు విధించడం వంటి అంశాలను నియంత్రణ సంస్థ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

2022 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు స్టార్‌ హెల్త్‌ కార్యకలాపాలపై నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ముఖ్యంగా కోవిడ్‌ బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అవసరం లేదనే కారణంతో కొన్ని క్లెయిమ్‌లను తిరస్కరించినట్లు ఐఆర్‌డీఏఐ గుర్తించింది. వైద్యుల సూచనలు, పాలసీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో నియంత్రణ సంస్థ తప్పులను ఎత్తిచూపిన తర్వాతే బీమా మొత్తాలను చెల్లించినట్లు పేర్కొంది.

మరోవైపు, క్లెయిమ్‌లను తిరస్కరించినప్పుడు లేదా చెల్లింపు మొత్తాన్ని తగ్గించినప్పుడు అందుకు సంబంధించిన నిర్దిష్ట పాలసీ నిబంధనలను వినియోగదారులకు వివరించలేదని ఐఆర్‌డీఏఐ గుర్తించింది. దీంతో తమ క్లెయిమ్‌లు ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో తెలుసుకోవడంతో పాటు, ఆ నిర్ణయాలను సవాలు చేసే అవకాశం పాలసీదారులకు లేకుండా పోయిందని అభిప్రాయపడింది.

ఈ ఉల్లంఘనలకు సంబంధించి రూ.1 కోటి జరిమానా కోవిడ్‌ క్లెయిమ్‌ల తిరస్కరణకు, మరో రూ.1 కోటి పాలసీ నిబంధనలకు విరుద్ధమైన కోతలు, క్లెయిమ్‌ నిర్ణయాలపై సరైన సమాచారం ఇవ్వకపోవడానికి విధించింది. ఈ జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, నెట్‌వర్క్‌ ఆసుపత్రులతో కుదుర్చుకున్న రాయితీలు ఆసుపత్రి బిల్లుల్లో చూపించకపోవడంపై హెచ్చరించింది. ఇకపై క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ లేఖల్లో ఆమోదించిన మొత్తం, తిరస్కరించిన మొత్తం, చెల్లింపునకు అర్హత లేని ఖర్చులు, రాయితీలు, బీమా మొత్తంలో తగ్గింపులను విడివిడిగా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఉత్తర్వులను కంపెనీ బోర్డు ముందు ఉంచి, 90 రోజుల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ జరిమానాపై అందుబాటులో ఉన్న తదుపరి చర్యలను పరిశీలిస్తున్నట్లు స్టార్‌ హెల్త్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement