స్విగ్గీలో 340 ఉద్యోగాల కోత? ఏఐ ఎఫెక్ట్‌.. | Swiggy Instamart Layoffs 340 Jobs Risk as AI Reshapes Quick Commerce Workforce | Sakshi
Sakshi News home page

స్విగ్గీలో 340 ఉద్యోగాల కోత? ఏఐ ఎఫెక్ట్‌..

Nov 27 2026 4:36 PM | Updated on Nov 27 2026 4:45 PM

Swiggy Instamart Layoffs 340 Jobs Risk as AI Reshapes Quick Commerce Workforce

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి చెందిన క్విక్-కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్‌లో సుమారు 340 ఉద్యోగాలకు కోత విధించినట్లు వ్యాపార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా కార్పొరేట్, సపోర్ట్ విభాగాలపై ఈ ప్రభావం పడినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఏ విభాగంలో ఎంతమందిని తొలగించారనే దానిపై స్పష్టత లేదు. ఈ పరిణామంపై స్విగ్గీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించనందున ఈ లేఆఫ్స్‌ సంఖ్యను కంపెనీ ధ్రువీకరించిన గణాంకాలుగా పరిగణించలేమని గుర్తుంచుకోవాలి.

కొనసాగుతోన్న నష్టాలు

కంపెనీ కార్యకలాపాల్లో జనరేటివ్ ఏఐ వినియోగాన్ని పెంచడం, బృందాల మధ్య ఒకే తరహా పనుల పునరావృతాన్ని నివారించడం ద్వారా నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, 2026 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక అధికారిక ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే ఇన్‌స్టామార్ట్ వ్యాపార విస్తరణ వేగంగా ఉన్నప్పటికీ నష్టాల భారం కొనసాగుతోంది.

ఆర్డర్ల విలువ: నికర ఆర్డర్ విలువ త్రైమాసిక ప్రాతిపదికన 13.4 శాతం వృద్ధితో రూ.6,594 కోట్లకు చేరింది.

డార్క్ స్టోర్లు: కొత్తగా 69 స్టోర్ల ఏర్పాటుతో మొత్తం డార్క్ స్టోర్లు సంఖ్య 1,240కి పెరిగింది.

నష్టాల తీరు: సర్దుబాటు చేసిన ఈబీఐటీడీఏ (EBITDA) నష్టం జూన్ త్రైమాసికంలోని రూ.778 కోట్ల నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.895 కోట్లకు పెరిగింది. అయితే, నష్టం మార్జిన్ -9.8 శాతం నుంచి -9.7 శాతానికి స్వల్పంగా మెరుగుపడింది.

క్విక్-కామర్స్ రంగంలో బ్లింకిట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్ నౌ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న వేళ ఇన్‌స్టామార్ట్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. స్విగ్గీ క్యూ2 వాటాదారుల లేఖ ప్రకారం, ఇన్‌స్టామార్ట్‌ను భారతీయ యాజమాన్య, నియంత్రణ సంస్థగా మార్చడంతో పాటు ఇన్వెంటరీ ఆధారిత నమూనాకు మారే ప్రక్రియను వేగవంతం చేసింది. దీనివల్ల సరఫరా గొలుసు, ధరలు, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులపై పూర్తి నియంత్రణ లభిస్తుందని యాజమాన్యం ఆశిస్తోంది. వృద్ధిని కొనసాగిస్తూనే నష్టాలను కట్టడి చేయడం ఇప్పుడు ఇన్‌స్టామార్ట్ ముందున్న సవాలు. ఉద్యోగాల కోతపై స్విగ్గీ అధికారిక ప్రకటన వెలువడితేనే వాస్తవ పరిస్థితిపై పూర్తి స్పష్టత రానుంది.

ఇదీ చదవండి: అత్తకు రూ.6000 కోట్లు ఇచ్చేదే లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement