ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ (ఎన్‌ఏబీ)లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వాలంటరీ రిడండెన్సీ) కోసం దరఖాస్తు చేసుకున్న కొందరు ఉద్యోగులకు యాజమాన్యం అధికారికంగా తుది నిర్ణయం తెలియజేయకముందే సిస్టమ్ నుంచి ఆటోమేటెడ్ ఈ-మెయిల్స్ అందాయి. మేనేజర్లతో వ్యక్తిగత చర్చలు, అధికారిక సమావేశాలు జరగకముందే ఈ నోటిఫికేషన్లు వెళ్లడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పొరపాటును అంగీకరించిన యాజమాన్యం
ఈ సాంకేతిక తప్పిదంపై ఎన్‌ఏబీ యాజమాన్యం తక్షణమే స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు నేరుగా నిర్ణయాలు వెల్లడించిన తర్వాత మాత్రమే సంబంధిత నోటిఫికేషన్లు వెళ్లాల్సి ఉందని స్పష్టం చేసింది. ‘ఇలా జరగడం పట్ల మేము ఎంతో బాధపడుతున్నాం. లేఆఫ్స్‌కు సంబంధించి ఆటోమేటెడ్ ఈ-మెయిల్స్ అందుకోవడం ఉద్యోగులకు తీవ్ర కలవరపాటు, అసౌకర్యం కలిగిస్తుందని మాకు తెలుసు’ అని అంతర్గత ప్రకటనలో పేర్కొంది. ప్రభావిత ఉద్యోగులతో ముందుగానే మాట్లాడి వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతామని, వారి దరఖాస్తులపై పూర్తి స్పష్టతనిస్తామని బ్యాంక్ హామీ ఇచ్చింది.
2,500 ఉద్యోగాల కోతకు ప్రణాళిక
ఈ ఘటనకు బ్యాంక్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలే నేపథ్యం. 2026 అక్టోబర్ 20న ఎన్‌ఏబీ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2027 ఆర్థిక సంవత్సరంలో తన అంతర్గత సిబ్బందిలో గరిష్ఠంగా 2,500 మందిని (మొత్తం ఉద్యోగుల్లో సుమారు 6 శాతం) తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1,500 ఉద్యోగాల కోతను 2026 చివరి నాటికి పూర్తి చేయనుంది.
కార్యకలాపాల సరళీకరణ, పునరావృత పనుల తగ్గింపు, వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన వినియోగదారుల సేవల కోసమే ఈ చర్యలు చేపడుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఈ కోతలు ప్రధానంగా కార్పొరేట్ విభాగాలకే పరిమితమని, కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే బ్యాంకింగ్ సేవల ఉద్యోగులపై పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
ఉద్యోగులకు అండగా ప్రత్యేక చర్యలు
పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులతో పాటు ఫైనాన్స్ సెక్టార్ యూనియన్‌తోనూ సంప్రదింపులు జరుపుతామని ఎన్‌ఏబీ తెలిపింది. ఉద్యోగాలు కోల్పోయే వారికి సంస్థలోనే ఇతర విభాగాల్లో పునర్నియామక అవకాశాలు, నైపుణ్యాల అభివృద్ధి, కెరీర్ మార్పునకు తోడ్పాటుతో పాటు నిబంధనల మేరకు పూర్తి రిడండెన్సీ ప్రయోజనాలు అందిస్తామని భరోసా ఇచ్చింది. కాగా, ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కోసం 2027 ఆర్థిక సంవత్సరంలో పన్నులకు ముందు సుమారు 300 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చవుతుందని బ్యాంక్ అంచనా వేసింది.
ఇదీ చదవండి: బంగారం కొనుగోలుదారులకు పండగ దినం!


