వాట్సాప్‌ వెబ్‌తో జాగ్రత్త! | WhatsApp Web Warning Why Govt Advises Against Sharing Sensitive Info Online | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ వెబ్‌తో జాగ్రత్త!

Nov 25 2026 11:56 AM | Updated on Nov 25 2026 11:56 AM

WhatsApp Web Warning Why Govt Advises Against Sharing Sensitive Info Online

వాట్సాప్‌ వెబ్‌ వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ పరిధిలోని భారత సైబర్‌ క్రైమ్‌ సమన్వయ కేంద్రం (I4C) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ, సంస్థాగత, ఆర్థిక, రహస్య సహా ఇతర కీలక సమాచారాన్ని కంప్యూటర్లలోని వాట్సాప్‌ వెబ్‌ సెషన్ల ద్వారా పంపించుకోవద్దని స్పష్టం చేసింది. బ్రౌజర్‌లో వాట్సాప్‌ వెబ్‌ అకౌంట్‌ను లాగిన్‌ చేసి అలాగే వదిలేస్తే సైబర్‌ నేరగాళ్లు ఆ సెషన్‌ను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఐ4సీలోని నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ థ్రెట్‌ అనలిటిక్స్‌ యూనిట్‌ (ఎన్‌సీటీఏయూ) ఇటీవల ‘సేఫ్‌ యూజ్‌ ఆఫ్‌ వాట్సాప్‌ వెబ్‌’ పేరుతో సూచనలు జారీ చేసింది.

లాగిన్‌ సెషన్‌ ఉంటే.. ముప్పు తప్పదా?

మొబైల్‌లోని వాట్సాప్‌ అకౌంట్‌ను కంప్యూటర్‌ బ్రౌజర్‌లో లింక్‌ చేసి వాడుకోవడం సాధారణమే. అయితే లింక్‌ చేసిన సెషన్‌ యాక్టివ్‌గా ఉండి ఆ కంప్యూటర్‌ను ఇతరులు యాక్సెస్‌ చేయగలిగితే తీవ్ర ముప్పు పొంచి ఉంటుంది. అనధికార వ్యక్తులు ప్రైవేట్‌ సందేశాలను చదవడం, వినియోగదారుడి పేరుతో మెసేజ్‌లు పంపడం, కాంటాక్టులు, గ్రూప్‌ చాట్‌లను చూడడం వంటి చర్యలకు పాల్పడవచ్చు.

బాధితుడి గుర్తింపును అడ్డుపెట్టుకుని మోసాలు, ఫిషింగ్‌, సోషల్‌ ఇంజినీరింగ్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐ4సీ తెలిపింది. ముఖ్యంగా కార్యాలయ కంప్యూటర్లు, షేర్డ్‌ సిస్టమ్‌లు, పబ్లిక్‌ కంప్యూటర్లు, ఇతరులు సులభంగా చేరుకోగల పరికరాల వద్ద కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ట్యాబ్‌ మూసేస్తే సరిపోదు!

వాట్సాప్‌ వెబ్‌ వాడకంలో అత్యంత కీలకమైన నియమం మాన్యువల్‌గా లాగ్‌ అవుట్‌ కావడం. కేవలం బ్రౌజర్‌ విండో లేదా ట్యాబ్‌ను మూసేస్తే లాగ్‌ అవుట్‌ అయినట్లు కాదని I4C స్పష్టం చేసింది. పని ముగిసిన వెంటనే వాట్సాప్‌ వెబ్‌ నుంచి తప్పనిసరిగా లాగ్‌ అవుట్‌ కావాలని సూచించింది.

అవసరం లేనప్పుడు అకౌంట్‌ను కంప్యూటర్‌లో నిరంతరం లాగిన్‌ చేసి ఉంచకూడదు. సైబర్‌ కేఫ్‌లు, పబ్లిక్‌ కియోస్క్‌లు, హోటళ్ల బిజినెస్‌ సెంటర్లు, ఇతరుల కంప్యూటర్లు, నమ్మకంలేని పరికరాల్లో లాగిన్‌ చేయవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో నమ్మకమైన కంప్యూటర్‌లో ఇన్‌కాగ్నిటో లేదా ప్రైవేట్‌ బ్రౌజింగ్‌ మోడ్‌ను వాడాలి; అయితే సెషన్‌ పూర్తయ్యాక మాన్యువల్‌గా లాగ్‌ అవుట్‌ కావడం మాత్రం మర్చిపోకూడదు.

అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా

తమ ఖాతా నుంచి తాము పంపని మెసేజ్‌లు వెళ్లడం లేదా కాంటాక్టుల నుంచి అసాధారణ స్పందనలు రావడం గమనిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వాట్సాప్‌ యాప్‌లోని ‘లింక్డ్‌ డివైజెస్‌’ విభాగాన్ని తరచూ తనిఖీ చేసి గుర్తు తెలియని పరికరాలను వెంటనే డిస్‌కనెక్ట్‌ చేయాలి. ఆపరేటింగ్‌ సిస్టమ్‌, బ్రౌజర్‌, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ అనుమానాస్పద డౌన్‌లోడ్లు, తెలియని ఫైళ్లు, క్రాక్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇదీ చదవండి: బంగారం కొనుగోలుదారులకు పండగ దినం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement