2027లో నియామకాల జోరు
8 శాతం పెరగనున్న వైట్ కాలర్ ఉద్యోగాలు
ఫౌండిట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ నివేదిక
వచ్చే ఏడాది (2027) హైరింగ్ కార్యకలాపాలు మరింతగా పుంజుకోనున్నట్లు ఫౌండిట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ (ఫిట్) ఒక నివేదికలో తెలిపింది. దీనితో వైట్–కాలర్ ఉద్యోగాలు (ప్రధానంగా ఆఫీసుల్లో చేసేవి) 8.16 శాతం పెరిగి 1.38 కోట్లకు చేరతాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి–అక్టోబర్ మధ్యకాలంలో ఈ మార్కెట్ 3.30 శాతం పెరిగినట్లు వివరించింది.
2027లో కన్జూమర్ ఎల్రక్టానిక్స్ (14.25 శాతం), రిటైల్ (13.99%), తయారీ (12.02 శాతం) రంగాల్లో హైరింగ్ డిమాండ్ అత్యధికంగా ఉండనుందని రిపోర్టు తెలిపింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (10.03%), లాజిస్టిక్స్..రవాణా (10.15 శాతం) రంగాల్లో కూడా నియామకాల వృద్ధి నమోదు అవుతుందని వివరించింది. కోయంబత్తూర్‌లో హైరింగ్ అత్యధికంగా 12.52 శాతంగా ఉండనుంది. ఆ తర్వాత స్థానాల్లో బెంగళూరు (11.29%), హైదరాబాద్ (10.33 శాతం) ఉంటాయని తెలిపింది. ఫౌండిట్‌డాట్‌ఇన్ పోర్టల్‌లో జాబ్ పోస్టింగ్‌ల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఫిట్ రిపోర్టులో
మరిన్ని ముఖ్యాంశాలు..
2026 జనవరి–అక్టోబర్ మధ్య నాన్–ప్రాఫిట్ సంస్థలు (19.44%), రియల్ ఎస్టేట్ (16.09%), ట్రావెల్..టూరిజం (13.76%) రంగ నియామకాల్లో భారీ వృద్ధి నమోదైంది. ఉద్యోగ విధులపరంగా చూస్తే ఐటీ నియామకాలు 20.28 శాతం మేర పెరిగాయి.
నగరాలవారీగా హైరింగ్‌లో హైదరాబాద్ (8.51 శాతం) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బెంగళూరు (6.71 శాతం), ముంబై (6.15 శాతం), కొచ్చి (5.57 శాతం) ఉన్నాయి. కోల్‌కతా (మైనస్ 10.03 శాతం), చండీగఢ్ (మైనస్ 11.19 శాతం) నగరాల్లో హైరింగ్ క్షీణించింది.
ఇదీ చదవండి: సారొచ్చారు.. బంగారాన్ని పెంచారు!


