తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వివాదం మరింత ముదురుతోంది. ఈ వివాదానికి సంబంధించిన కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. హిందూ ధర్మ పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది జై సాయిదీపక్, మదురై కలెక్టర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపా శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. విచారణ ప్రారంభంలోనే సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన విస్తృత అంశాల జోలికి వెళ్లబోమని నవంబరు 20 నాటి కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
దీపథూన్ స్తంభం వద్ద దీపం వెలిగించడంలో విఫలమైనందుకు తమిళనాడు ప్రభుత్వం రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పింది. ఇందుకు ఆలయ అధికారులనే బాధ్యులుగా పేర్కొంది. మదురైలోని అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయంలో కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే అంశంపై ఈ వివాదం తలెత్తింది. సోమవారం వార్షిక కార్తీక దీపోత్సవం సందర్భంగా సంప్రదాయంగా దీపం వెలిగించే ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించారు. వివాదానికి కేంద్రబిందువైన దీపథూన్ రాతి స్తంభం వద్ద మాత్రం దీపం వెలిగించలేదు.
నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నవంబర్ 24న ఒక్కసారి మాత్రమే దీపథూన్ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఉంది. అయితే ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో వివాదం మరింత ముదిరింది. తిరుపరంకుండ్రం కొండపై ఉన్న ఈ ఆలయంలో ఉత్సవ దీపాన్ని ఎక్కడ, ఎవరు వెలిగించాలన్నదే ప్రధాన వివాదంగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: విజయ్ సర్కార్ మరో కీలక నిర్ణయం


