నేడు కేంద్ర కేబినేట్‌ భేటీ.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు | Centre Moves to Hike Lok Sabha Seats by 50percent Without Hurting Southern States | Sakshi
Sakshi News home page

నేడు కేంద్ర కేబినేట్‌ భేటీ.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

Nov 27 2026 10:03 AM | Updated on Nov 27 2026 10:09 AM

Centre Moves to Hike Lok Sabha Seats by 50percent Without Hurting Southern States

సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), సవరించిన మహిళా రిజర్వేషన్ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో డీలిమిటేషన్ బిల్లు ముసాయిదాకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం ఆ బిల్లు ప్రతులను ఎంపీలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు తెరదించుతూ, గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం 2001లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణ ఫార్ములానే కేంద్రం అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ముసాయిదా బిల్లులో ప్రధానంగా మూడు కీలక ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం

జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా, జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం మేర లోక్‌సభ సీట్లను పెంచేలా బిల్లులోనే లిఖితపూర్వక ప్రతిపాదన పొందుపరిచినట్లు తెలుస్తోంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు ఉన్న ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని  మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని బిల్లులో ప్రతిపాదించారు.

రాష్ట్రాలకు కేటాయించిన సీట్ల నిష్పత్తి మారకపోయినప్పటికీ, ఆయా రాష్ట్రాల పరిధిలోని నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజన మాత్రం 2011 జనాభా లెక్కల ఆధారంగానే చేపట్టనున్నారు.

ఈ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. లోక్‌సభ నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు సమావేశం కానుండగా, రాజ్యసభ డిసెంబర్ 2న భేటీ కానుంది. మరోవైపు, సవరించిన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ముసాయిదాపై క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

అయితే, కేంద్రం తీసుకొస్తున్న ఈ డీలిమిటేషన్ బిల్లును ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకుండా, ప్రస్తుతమున్న 543 లోక్‌సభ సీట్లలోనే తక్షణమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని అంటే 181 సీట్లను మహిళలకు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్షాల అభ్యంతరాలు ఎలా ఉన్నా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ కీలక బిల్లులను సునాయాసంగా పాస్ చేసుకుంటామన్న పూర్తి ధీమాలో పాలక పక్షం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement