వన్యప్రాణుల రక్షణ కోసం.. ఒక్కటైన 30 దేశాలు! | At Anant Ambani Vantara Global Zoos Turn To Shared Data to Protect Wildlife | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల రక్షణ కోసం.. ఒక్కటైన 30 దేశాలు!

Nov 4 2026 12:05 PM | Updated on Nov 4 2026 12:13 PM

At Anant Ambani Vantara Global Zoos Turn To Shared Data to Protect Wildlife

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరికి ఉంది. అంతరించిపోతున్న జంతువులను కాపాడటం, వాటి సహజ ఆవాసాలను రక్షించడం, జంతువులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం వంటి విషయాల్లో వివిధ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యంతోనే యూరేషియన్ రీజినల్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (EARAZA) 2026 వార్షిక అంతర్జాతీయ సదస్సును గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారాలో నిర్వహించారు.

30 దేశాలు.. 98 సంస్థలు
అక్టోబర్ 26 నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 30 దేశాలకు చెందిన 98 సంస్థల ప్రతినిధులతో పాటు, భారతదేశంలోని 29 జంతుప్రదర్శనశాలలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇందులో వన్యప్రాణి నిపుణులు, పశువైద్యులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ పరిరక్షణ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొని తమ అనుభవాలను, పరిశోధనలను పంచుకున్నారు.

EARAZA సదస్సు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంచి వన్యప్రాణుల సంరక్షణను మరింత మెరుగుపరచడం. అక్టోబర్ 26న ప్రముఖ సంగీత దర్శకుడు, పర్యావరణవేత్త, మూడు సార్లు గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్ సంగీత ప్రదర్శనతో సదస్సు ప్రారంభమైంది. ఆ తరువాత.. పలువురు ప్రముఖుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 'ఇండియన్ జూ ఇయర్‌బుక్ వాల్యూమ్ 11, 2026' పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.

ఉచితంగా ANTZ సాఫ్ట్‌వేర్‌
ఈ సదస్సులో వంతారా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. జంతుప్రదర్శనశాలల నిర్వహణకు ఉపయోగపడే ANTZ సాఫ్ట్‌వేర్‌ను.. EARAZA సభ్య సంస్థలకు ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వివిధ దేశాల్లోని జంతుప్రదర్శనశాలలు జంతువుల ఆరోగ్యం, వాటి సంరక్షణ, నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. దీనివల్ల ఒక దేశంలో జరిగిన పరిశోధన మరొక దేశానికి కూడా ఉపయోగపడుతుంది.

సదస్సులో అమూర్ పులి, ఓరియంటల్ స్టార్క్, బ్లాకిస్టన్ ఈగిల్ ఆవుల్, గ్రేట్ బస్టర్డ్ వంటి అరుదైన జంతువులు, పక్షుల సంరక్షణపై చర్చించారు. అంతే కాకుండా.. భారతీయ అడవి గాడిదల పరిరక్షణ, పాముల సంరక్షణ, అంతరించిపోతున్న జాతుల పెంపకం, తిరిగి వాటిని సహజ ఆవాసాల్లోకి ప్రవేశపెట్టడం వంటి అంశాలపై కూడా నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

వన్యప్రాణుల పట్ల అవగాహన
రెండవ రోజు మానవులు - వన్యప్రాణుల మధ్య సహజీవనం, పట్టణ ప్రాంతాల్లో జీవవైవిధ్య పరిరక్షణ, పాముకాటు నివారణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. జంతుప్రదర్శనశాలల్లో జంతువులకు ఆహారం, వైద్యం అందించడం మాత్రమే కాకుండా, అవి ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించడం అవసరమని నిపుణులు తెలిపారు. ప్రముఖ వన్యప్రాణి జీవశాస్త్రవేత్త ఫారెస్ట్ గలాంటే ప్రజల్లో వన్యప్రాణుల పట్ల అవగాహన పెంచడంలో మీడియా పాత్ర గురించి వివరించారు.

అదేవిధంగా అడవుల్లో లేదా జంతు సంరక్షణ కేంద్రాల్లో ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు జంతువులను ఎలా రక్షించాలి అనే అంశంపై కూడా చర్చించారు. ఏనుగుల సంరక్షణలో విశేష సేవలు అందించిన పద్మశ్రీ డాక్టర్ కె.కె. శర్మ.. మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించడానికి తన అనుభవాలను పంచుకున్నారు.

జంతువుల రోజువారీ సంరక్షణ
మూడవ రోజు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వంతారా అభివృద్ధి చేసిన Vespr అనే AI ఆధారిత పరికరం పక్షులు, ఇతర జంతువుల శబ్దాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. Smart Egg Analysis ద్వారా పక్షుల గుడ్ల అభివృద్ధిని పరిశీలించవచ్చు. అలాగే NFC సాంకేతికతతో జంతువుల రోజువారీ సంరక్షణ వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయవచ్చు. ఇవి భవిష్యత్తులో జంతువుల సంరక్షణను మరింత సులభతరం చేయనున్నాయి.

ఈ సందర్భంగా వివిధ దేశాలకు చెందిన 13 సంస్థలు తమ ఆధునిక పరికరాలు, వైద్య సాంకేతికతలు, జన్యు పరిశోధనలు, జంతువుల చికిత్సకు సంబంధించిన పరికరాలను ప్రదర్శించాయి. వంతారా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనల్లో జంతువుల సంరక్షణ, పోషకాహారం, ఆధునిక నిర్మాణాలు, వర్చువల్ రియాలిటీ వంటి అంశాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

చివరి రోజు ఏనుగుల సంరక్షణ, జంతువులకు సరైన పోషకాహారం అందించడం, వ్యాధుల నివారణ, సహజ ఆవాసాల పరిరక్షణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా రక్షించబడిన ఆసియా ఏనుగులకు శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్స అందించడం, వాటిని తిరిగి సహజ వాతావరణానికి అలవాటు చేయడం వంటి విషయాలపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఆరుగురికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
సదస్సు ముగింపు కార్యక్రమంలో వన్యప్రాణుల సంరక్షణకు విశేష సేవలు అందించిన ''స్వెత్లానా అకులోవా, రెనే ఫ్రానెక్, అజర్ హుసేనోవ్, ఎస్.సి. శర్మ, డాక్టర్ డి.ఎన్. సింగ్, డాక్టర్ బి.ఎస్. బోనాల్''లకు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'లను అందజేశారు. చివరగా.. 2027లో తదుపరి సదస్సును నిర్వహించనున్న చైనాకు EARAZA జెండాను అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement