ఎయిర్‌టెల్ ఎరీనా.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు హైటెక్ టచ్! | District And Airtel Partner To Launch Airtel Arena | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఎయిర్‌టెల్ ఎరీనా.. ఎంటర్‌టైన్‌మెంట్‌కు హైటెక్ టచ్!

Nov 4 2026 10:48 AM | Updated on Nov 4 2026 10:48 AM

District And Airtel Partner To Launch Airtel Arena

బెంగళూరులో లైవ్ కాన్సర్ట్‌లు, మ్యూజిక్ ఈవెంట్లకు వెళ్లే అభిమానులకు ఇకపై మరింత మెరుగైన అనుభవం అందనుంది. ఎందుకంటే.. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ డిస్ట్రిక్ట్ కలిసి కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా బెంగళూరులో 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ఎయిర్ కాన్సర్ట్ వేదికకు ఇకపై ‘ఎయిర్‌టెల్ ఎరీనా’ (Airtel Arena) అని పేరు పెట్టనున్నారు.

అయితే.. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు.. ఈ వేదికలో డిజిటల్ సదుపాయాలను కూడా భారీగా మెరుగుపరచాలని రెండు సంస్థలు నిర్ణయించాయి. సాధారణంగా పెద్ద కాన్సర్ట్‌లు జరిగినప్పుడు వేలాది మంది ఒకేసారి మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తుంటారు. దీంతో నెట్‌వర్క్ సమస్యలు తలెత్తడం, ఇంటర్నెట్ నెమ్మదించడం, ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎయిర్‌టెల్ ప్రత్యేకమైన హై కెపాసిటీ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల భారీ ఈవెంట్ల సమయంలో కూడా అభిమానులకు వేగవంతమైన ఇంటర్నెట్, మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యం. మరోవైపు డిస్ట్రిక్ట్ సంస్థ ఈ వేదికలో జరిగే ఈవెంట్లు, కళాకారులు, అభిమానులు, నిర్వాహకులకు సంబంధించిన అనుభవాలను పర్యవేక్షించనుంది.

ఇప్పటికే ఈ కాన్సర్ట్ వేదికలో మొబైల్ ద్వారా ముందుగానే ఫుడ్ ఆర్డర్ చేసుకునే సదుపాయం, క్యాష్‌లెస్ టాప్‌అప్ వంటి డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయనున్న సదుపాయాలతో ఈ సేవలను మరింత మెరుగుపరచనున్నారు. రాబోయే ఈవెంట్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ మార్పులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement