దీపావళి బోనస్‌గా ప్రభుత్వం రూ.8,000 ఇస్తోందా? | Is Govt Giving Rs 8000 as Diwali Bonus Know The PIB Fact Check | Sakshi
Sakshi News home page

దీపావళి బోనస్‌గా ప్రభుత్వం రూ.8,000 ఇస్తోందా?

Nov 4 2026 8:35 AM | Updated on Nov 4 2026 8:42 AM

Is Govt Giving Rs 8000 as Diwali Bonus Know The PIB Fact Check

దీపావళి పండుగ వచ్చిందంటే.. కొత్త బట్టలు, స్వీట్లు, కానుకలతో పాటు ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సాయం అందుతుందా అని చాలామంది ఎదురుచూస్తుంటారు. ఇలాంటి ఆశలనే కొందరు సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటారు. ఇప్పుడు తాజాగా.. ప్రధానమంత్రి పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ రూ.8,000 దీపావళి బోనస్ ఇస్తోందంటూ వాట్సాప్‌లో తప్పుడు సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఈ మెసేజ్‌లను చూసి నిజమేనని నమ్మి లింకులపై క్లిక్ చేస్తే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) హెచ్చరించింది.

నిజానికి.. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రూ.8,000 దీపావళి బోనస్ స్కీమ్ ప్రకటించలేదు. వాట్సాప్‌లో ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా నకిలీ అని పీఐబీ స్పష్టం చేసింది. కాబట్టి, ఇలాంటి సందేశాలు వస్తే వాటిని నమ్మకూడదని, అందులో.. ఇచ్చిన లింకులను ఓపెన్ చేయకూడదని ప్రజలకు సూచించింది.

అసలు ఈ మోసం ఇలా..
సైబర్ నేరగాళ్లు ముందుగా వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపిస్తారు. అందులో.. ప్రధానమంత్రి పేరుతో దీపావళి కానుకగా రూ.8,000 అందిస్తున్నారని చెబుతారు. ఆ డబ్బులు పొందాలంటే వెంటనే ఒక లింక్‌పై క్లిక్ చేయాలని సూచిస్తారు. ప్రభుత్వమే డబ్బులు ఇస్తోందని భావించిన కొందరు ఆ లింక్‌ను ఓపెన్ చేస్తారు.

అక్కడ ఒక నకిలీ వెబ్‌సైట్ కనిపిస్తుంది. అందులో పేరు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలని అడుగుతారు. కొన్నిసార్లు బోనస్ పొందడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని కూడా చెబుతారు. ఇలా ప్రజలను నమ్మించి వారి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సేకరించడమే ఈ మోసం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.

యూపీఐ ద్వారా..
మరికొన్ని సందర్భాల్లో.. యూపీఐ ద్వారా డబ్బులు పంపించేలా చేసి ఖాతాలోని మొత్తాన్ని కాజేస్తారు. ఇంకొన్ని సందర్భాల్లో మొబైల్‌లో నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించి ఫోన్‌లోని సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. అందుకే.. చిన్న మొత్తంలో బోనస్ వస్తుందనే ఆశతో తెలియని లింకులపై క్లిక్ చేయడం ప్రమాదకరం.

సైబర్ క్రైమ్ హెచ్చరిక
ఈ తరహా మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా రూ.8,000 దీపావళి బోనస్ పేరుతో జరుగుతున్నది ఫిషింగ్ స్కామ్ అని స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకం పేరుతో ప్రజలను నమ్మించి వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారాన్ని దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

మీకు ఇలాంటి మెసేజ్ వస్తే ఏం చేయాలి?
మీ వాట్సాప్‌కు కూడా రూ.8,000 బోనస్ అంటూ మెసేజ్ వస్తే.. ముందుగా దాని నిజానిజాలు తెలుసుకోండి. తెలియని నంబర్ల నుంచి వచ్చిన లింకులపై క్లిక్ చేయకండి. అలాంటి మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్ చేయకండి. ముఖ్యంగా ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పకండి. ప్రభుత్వం నుంచి నిజంగా ఏదైనా పథకం లేదా ఆర్థిక సాయం అందుతుందా లేదా అనే విషయాన్ని అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లలో మాత్రమే పరిశీలించాలి. బోనస్ ఇస్తామని చెప్పి ఎవరైనా ముందుగా డబ్బులు అడిగితే అస్సలు చెల్లించకండి.

ఇదీ చదవండి: బంగారం డిమాండ్.. WGC రిపోర్ట్

డబ్బులు పోతే ఇలా చేయండి
ఒకవేళ పొరపాటున ఇలాంటి లింక్‌ను నమ్మి డబ్బులు పోగొట్టుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే మీ బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. అలాగే https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన తప్పుడు ప్రచారాలు, అనుమానాస్పద సందేశాల గురించి PIB ఫ్యాక్ట్ చెక్ విభాగానికి కూడా తెలియజేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement