ఎన్‌ఎస్‌ఈ లాభం జూమ్‌ | NSE Q2 net profit rises 23 percent to Rs 2578 crore | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈ లాభం జూమ్‌

Nov 4 2026 4:02 AM | Updated on Nov 4 2026 4:02 AM

NSE Q2 net profit rises 23 percent to Rs 2578 crore

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం వార్షికంగా 23 శాతం ఎగసి రూ. 2,578 కోట్లకు చేరింది. లావాదేవీల ఆదాయం పుంజుకోవడం, వ్యయాలు భారీగా తగ్గడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 2,098 కోట్లు ఆర్జించింది. 

మొత్తం ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 4,554 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 4,160 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. లావాదేవీల చార్జీల నుంచి ఆదాయం 9 శాతం పుంజుకుని రూ. 3,035 కోట్లను తాకింది. నగదు మార్కెట్‌ సగటు రోజువారీ ట్రేడెడ్‌ పరిమాణం వార్షికంగా 24 శాతం జంప్‌చేసి రూ. 1,18,377 కోట్లకు చేరింది. ఈక్విటీ ఆప్షన్స్‌(ప్రీమియం విలువ)లో ఇది 3 శాతం పుంజుకుని రూ. 47,977 కోట్లుగా నమోదైంది. డేటా కనెక్టివిటీ చార్జీల నుంచి రూ. 267 కోట్లు, టెర్మినల్‌ సర్వీసుల నుంచి రూ. 165 కోట్లు, లిస్టింగ్‌ సర్వీసుల నుంచి రూ. 150 కోట్ల చొప్పున ఆదాయం అందుకుంది. 

అయితే మొత్తం వ్యయాలు 51 శాతం క్షీణించి రూ. 1,161 కోట్లకు పరిమితమయ్యాయి. గత క్యూ2లో ఇవి రూ. 2,354 కోట్లుకాగా.. సెబీ సెటిల్‌మెంట్‌ ఫీజుకింద రూ. 1,297 కోట్ల ప్రొవిజన్‌ చేపట్టిన విషయం విదితమే. ఎన్‌ఎస్‌ఈ స్టాండెలోన్‌ నికర లాభం 16 శాతం ఎగసి రూ. 2,164 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 3,956 కోట్లకు చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ఇటీవలే లిస్టయిన నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యతగల క్వార్టర్‌గా సంస్థ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. 
ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ షేరు బీఎస్‌ఈలో 1.4 శాతం లాభంతో రూ. 1,804 వద్ద ముగిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement