ఈ నెల 25కల్లా లిస్టింగ్‌కు చాన్స్
కోల్‌కతా: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ ఈ నెల 18న పబ్లిక్ ఇష్యూ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 22న ఇష్యూ ముగియనుండటంతో ఈ నెల 25కల్లా లిస్ట్‌కావచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఎక్స్ఛేంజీ సొంత షేర్ల లిస్టింగ్‌కు సెబీ నిబంధనలు అనుమతించనందున మరో స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈలో నమోదుకానుంది. ఇదే బాటలో ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈలో బీఎస్‌ఈ లిస్టయిన విషయం విదితమే. ఇష్యూలో భాగంగా ఎన్‌ఎస్‌ఈ చెల్లించిన వాటా మూలధనంలో 6 శాతం వాటాను విక్రయించనుంది. రూ. 1 ముఖ విలువగల 14.89 కోట్ల షేర్లను ఎక్స్ఛేంజీలోని ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.
తద్వారా రూ. 30,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు ధరల శ్రేణి 15కల్లా ప్రకటించే అవకాశముంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 17న షేర్లను ఆఫర్ చేసే వీలుంది. ఇప్పటివరకూ 2024లో రూ. 27,870 కోట్లు సమీకరించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇష్యూ అతిపెద్ద ఐపీవోగా నిలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈ లిస్టయితే సరికొత్త రికార్డు నమోదు కానుంది. ఇష్యూ నిధులు ఎన్‌ఎస్‌ఈకికాకుండా షేర్లను ఆఫర్ చేస్తున్న వాటాదారులకు చేరనున్నాయి. ట్రేడయ్యే కాంట్రాక్టుల సంఖ్యరీత్యా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా ఎన్‌ఎస్‌ఈ నిలుస్తుండటం గమనార్హం!


