మెగా ఆఫర్‌కు సెబీ సై..
ఒక్కో షేరు రూ. 2,000!
రూ. 30,000 కోట్లపై కన్ను
అతిపెద్ద ఇష్యూగా రికార్డ్!
న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం లిస్టింగ్‌కు ఎట్టకేలకు తెరలేచింది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పచ్చ జెండా ఊపింది. ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్సే్ఛంజీగా నిలుస్తున్న ఎన్‌ఎస్‌ఈ.. సెబీ ఆమోదంతో లిస్టింగ్ ప్రణాళికలను వేగవంతం చేయనుంది. వచ్చే వారమే ధరల శ్రేణిని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ నెల 15కల్లా ఐపీవోకు తెరతీయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
టాప్–10లోకి...
ఐపీవోలో భాగంగా ఎన్‌ఎస్‌ఈ వాటా మూలధనంలో 6 శాతానికి సమానమైన 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 30,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఎల్‌ఐసీ, పేటీఎమ్, టాటా క్యాపిటల్, కోల్ ఇండియా ఇష్యూలను అధిగమించి అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలుంది. మరోపక్క జియో ప్లాట్‌ఫామ్స్ సైతం రూ. 37,700 కోట్ల మెగా ఐపీవో కోసం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఎన్‌ఎస్‌ఈ లిస్టయితే దేశీయంగా మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా టాప్–10లో నిలిచే అవకాశముంది. 1.8 లక్షలమంది వాటాదారులతో రూ. 5 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువను అందుకోవచ్చని అంచనా.
2016లో చెక్...
ఎన్‌ఎస్‌ఈ తొలుత 2016 డిసెంబర్‌లో పబ్లిక్ ఇష్యూ(రూ. 10,000 కోట్ల సమీకరణ)కు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అయితే లిస్టింగ్ ప్రణాళికలకు నియంత్రణ, న్యాయ, పాలనా సంబంధ వివాదాలు అడ్డుపడుతూ వచ్చాయి. ఆపై అవాంతరాల కారణంగా 2019, 2020, 2024లో ఎన్‌వోసీ కోసం పత్రాలు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో వివాద పరిష్కారాలకుగాను సెబీకి రూ. 1,491 కోట్లకుపైగా చెల్లించింది. ఎప్పటినుంచో నడుస్తున్న కోలొకేషన్, డార్క్‌ఫైబర్ కేసులపై ఈ వారం సుప్రీం కోర్టు సెబీ అప్పీల్‌ను కొట్టివేసిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈకి ఉపశమనం లభించింది. ఆపై తాజాగా సెబీ నుంచి అనుమతి పొందింది.
వాటాదారులు ఇలా...
ఐపీవోలో ప్రస్తుత వాటాదారు సంస్థలు ఈక్విటీ వాటాలను ఆఫర్ చేయనున్నాయి. తద్వారా తమ వాటాలను విక్రయించేందుకు(మానిటైజ్) వీలు చిక్కనుంది. దీంతో నిధులు ఎక్సే్చంజీకి చేరబోవు. బ్యాంకర్ల అంచనా ప్రకారం ఎన్‌ఎస్‌ఈ ఐపీవో ధర రూ. 2,000గా ఉండవచ్చు. ఈ నెల 11కల్లా ధరల శ్రేణిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈ ఐపీవోలో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ 2.48 కోట్ల షేర్లు, ఎంఎస్ స్ట్రాటజిక్(మారిషస్) 1.6 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఈ జాబితాలో కెనడా పెన్షన్ ప్లాన్, అరండా ఇన్వెస్ట్‌మెంట్స్, బీవోబీ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, జీఐసీసహా ఇతర బీమా కంపెనీలు చేరాయి. అయితే అతిపెద్ద వాటాదారు(10.72 శాతం) ఎల్‌ఐసీ షేర్లను విక్రయించడం లేదు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ వాటా 3.23 శాతంకాగా.. ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు 4.33 శాతం, స్టాక్ హోల్డింగ్‌కు 4.44 శాతం చొప్పున వాటా ఉంది.
డెరివేటివ్స్ కింగ్
దేశీయంగా ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్లో ఎన్‌ఎస్‌ఈ ఆధిపత్యం వహిస్తోంది. ట్రేడవుతున్న కాంట్రాక్టులరీత్యా ప్రపంచంలోనే అత్యంత రద్దీగల ఎక్సే్ఛంజీగా నిలుస్తోంది. ఇక గతేడాది(2025–26)లో మొత్తం ఆదాయం రూ. 18,713 కోట్లుకాగా.. నికర లాభం 15 శాతం తగ్గి రూ. 10,302 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2024–25) ఆదాయం రూ. 19,177 కోట్లుకాగా.. రూ. 12,188 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 3,120 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 9 శాతం ఎగసి రూ. 5,252 కోట్లకు చేరింది.
ఈ షేర్లకు పండుగ
ఎన్‌ఎస్‌ఈ లిస్ట్‌కానుండటంతో ఐఎఫ్‌సీఐ, న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. దీంతో తాజాగా ఐఎఫ్‌సీఐ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 101ను దాటింది. తొలుత రూ. 107కు ఎగసింది. ఇక న్యూ ఇండియా 17.5 శాతం దూసుకెళ్లి రూ. 230కు చేరింది. ఇవి 52 వారాల గరిష్ట ధరలుకాగా.. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్‌లో 52.86 శాతం వాటా కలిగిన ఐఎఫ్‌సీఐ ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్‌తో లబ్ధి పొందనుంది. స్టాక్ హోల్డింగ్‌కు ఎన్‌ఎస్‌ఈలో 4.44% వాటా ఉంది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈలో 1.42% వాటా కలిగిన న్యూ ఇండియా సైతం వాటా విక్రయం ద్వారా లాభపడనుంది. గత నెల రోజుల్లో ఐఎఫ్‌సీఐ 42%, న్యూ ఇండియా 33% చొప్పున బలపడటం గమనార్హం!
బంపర్ లిస్టింగ్..
ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్, ప్రయారిటీ జ్యువెల్స్ షేర్లు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్‌ను తాకి, అక్కడే లాక్ అయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే తొలి రోజే ఈఎస్‌డీఎస్ షేరు 109%, ప్రయారిటీ జ్యువెల్స్ షేరు 18 శాతం లాభాలు ఇన్వెస్టర్లకు పంచాయి.
→ ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ లిస్టింగ్ ఇష్యూ ధర (రూ.429)తో పోలిస్తే బీఎస్‌ఈలో ఏకంగా 74 శాతం ప్రీమియంతో రూ.746 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఇంట్రాడేలో 109 శాతం ఎగసి రూ.895.55 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకి, అక్కడే లాక్ అయింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.10,647 కోట్లుగా
నమోదైంది.
→ ప్రయారిటీ జ్యువెల్స్ ఇష్యూ ధర (రూ.200)తో పోలిస్తే 12 శాతం ప్రీమియంతో రూ.225 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 18 శాతం ఎగసి రూ.236 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకి, అక్కడే స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.426 కోట్లుగా నమోదైంది.


