ఈ నెలంతా పలు ఐపీవోలతో సందడి రేపిన ప్రైమరీ మార్కెట్లు కొత్త సెప్టెంబర్‌లోనూ కళకళలాడనున్నాయి. నేడు, రేపు రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానుండగా.. రెండు కంపెనీల ఇష్యూలు ముగియనున్నాయి. మరోపక్క ఈ వారం మెయిన్‌బోర్డులో ఏకంగా 8 కంపెనీలు లిస్ట్‌కానున్నాయి. వివరాలు చూద్దాం..
పర్పుల్ స్టైల్ @ రూ. 546–575
ఒక్కో షేరుకి రూ. 546–575 ధరల శ్రేణిలో పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభంకానుంది. సెపె్టంబర్ 2న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 680 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా పెర్నియాస్ పాపప్ షాప్ మాతృ సంస్థ రూ. 680 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఐపీవో నిధులలో రూ. 371 కోట్లు సొంత అనుబంధ సంస్థ పీఎస్‌ఎల్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేయనుంది. మరో రూ. 139 కోట్లు సేల్స్, మార్కెటింగ్ వ్యయాలకు కేటాయించనుంది.
మిగిలిన నిధులను మల్టీబ్రాండ్ లగ్జరీ ఫ్యాషన్ ఓమ్నీ చానల్ ప్లాట్‌ఫామ్ నిర్వాహక కంపెనీ సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ రిటైల్‌గా పెర్నియాస్ పాపప్ షాప్‌ల ద్వారా సంప్రదాయ దుస్తులు, వ్యక్తిగత విలాసవంత వస్తువులు తదితరాలను విక్రయిస్తోంది. కంపెనీలో ఇప్పటికే సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, సచిన్, మహేశ్ బాబు తదితరులు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే!
దీపా జ్యువెలర్స్ @ రూ. 168–177
షేరుకి రూ. 168–177 ధరల శ్రేణిలో బంగారు ఆభరణాల తయారీ కంపెనీ దీపా జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ రేపు(సెపె్టంబర్ 1న) ప్రారంభమై 3న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.18 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 460 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. 2016లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా హాల్‌మార్క్‌డ్ బంగారు ఆభరణాల బీటూబీ డిజైనర్, ప్రాసెసర్, సరఫరాదారుగా నిలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా కర్ణాటక, తమిళనాడు, కేరళలో కార్యకలాపాలు విస్తరించింది. కంపెనీ షేర్లు సెప్టెంబర్ 8న లిస్ట్‌కానున్నాయి.
లిస్టింగ్‌కు సై...
నేడు లుమినో ఇండస్ట్రీస్(రూ. 700 కోట్ల సమీకరణ) ఐపీవో ముగియనుండగా.. రేపు ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్(రూ. 720 కోట్ల సమీకరణ) ఇష్యూ ముగియనుంది. ఇటీవలే ఇష్యూలు ముగించుకున్న 6 కంపెనీలతోపాటు మరో 2 సంస్థలు స్టాక్ మార్కెట్లలో ఈ వారం లిస్ట్‌కానున్నాయి. జాబితాలో ఆగ్మంట్ ఎంటర్‌ప్రైజెస్(నేడు), హైటెక్ ఇంజినీర్స్, స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్, సింబయోటెక్ ఫార్మాల్యాబ్(రేపు) చేరాయి. సెప్టెంబర్ 2న అన్ను ప్రాజెక్ట్స్, 3న లుమినో ఇండస్ట్రీస్, ఈఎస్‌డీఎస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్, ప్రయారిటీ జ్యువెల్స్ 4న లిస్ట్‌కానున్నాయి.


