గతంతో పోలిస్తే నేటి తరం వారికి బోలెడన్ని అవకాశాలు ఉంటున్నాయి. ఉన్నత విద్య, స్పెషలైజ్డ్ కెరియర్ల నుంచి ఎంట్రప్రెన్యూర్‌షిప్, కొత్త రంగాల వరకు వాళ్లకు అనేకానేక మార్గాలు కనిపిస్తున్నాయి. అయితే, తల్లిదండ్రుల విషయానికొస్తే మాత్రం వాళ్ల ఆకాంక్షలను ప్రోత్సహించడం ఒక ఎత్తుగా ఉంటే వచి్చన అవకాశాన్ని వారు అందిపుచ్చుకునేలా తోడ్పాటు అందించేందుకు ఆర్థికంగా సర్వసన్నద్ధంగా ఉండటం మరో ఎత్తుగా ఉంటోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు కోసం సన్నద్ధం కావడమంటే వారు ఫలానా బాటలోనే వెళ్తారనుకోవడానికి లేదు. వైవిధ్యమైన అవకాశాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వారు దేన్ని ఎంచుకున్నా ఆర్థికంగా బాసటగా నిలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పొదుపు మాత్రమే చేస్తే సరిపోదు. ఆర్థిక ప్రణాళికలు కూడా సరైనవిగా ఉండాలి. వాటికి బీమా భద్రత కూడా అవసరమే.
ముందుగానే ప్రారంభిస్తే ప్రయోజనకరం..
సాధారణంగా పిల్లల ఉన్నత చదువులు లేదా కెరియర్ సంబంధ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం దగ్గర పడుతున్న తరుణంలో మాత్రమే చాలా మంది తల్లిదండ్రులు సీరియస్‌గా ఆర్థిక ప్రణాళికలు వేయడం మొదలుపెడతారు. నిజానికి, ఇవన్నీ దీర్ఘకాలిక లక్ష్యాలు. ఇందుకోసం రూపొందించుకున్న ఆర్థిక ప్రణాళిక సత్ఫలితాలనివ్వాలంటే తగినంత సమయం అవసరమవుతుంది.
ముందునుంచే ప్రారంభించడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. క్రమక్రమంగా నిధిని సమకూర్చుకోవచ్చు. అవసరం తలెత్తినప్పుడు అప్పటికప్పుడు పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడానికి హడావుడి పడటం కంటే, క్రమశిక్షణతో దీర్ఘకాలంపాటు పొదుపు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ప్రణాళిక విషయంలోనూ కాస్త వెసులుబాటు ఉండేలా చూసుకోవాలి. పిల్లల ఆసక్తులు, ఆకాంక్షలు, భవిష్యత్ లక్ష్యాలు మారుతుంటాయి.
అలాంటప్పుడు వాటికి తగ్గట్లుగా ఆర్థిక ప్రణాళికల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోగలగాలి. భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోగలగాలి. ఆఖరు నిమిషంలో కంగారుపడుతూ ఏర్పాట్లు చేసుకోవడం కాకుండా, ఒక పద్ధతి ప్రకారం సన్నద్ధమైతే ఆర్థికంగా ఒత్తిడి తగ్గతుంది. వీలైనంత ముందునుంచే పొదుపు చేయడమంటే, భవిష్యత్తులో కచ్చితంగా ఫలానాదే జరుగుతుందని ఊహించుకోవడమని కాదు. ఎలాంటి అవకాశాలు వచ్చిన ఆర్థికంగా సర్వసన్నద్ధంగా ఉండటం.
ఆకాంక్షలకు రక్షణ..
ఆర్థిక ప్రణాళికల్లో పొదుపు ప్రధానమైనదే అయినప్పటికీ, దీర్ఘకాలిక లక్ష్యాలకు రక్షణ కూడా కీలకమే. జీవితాల్లో కీలక దశలకు చేరుకోవడానికి పిల్లలకు ఇంకా చాలా సమయం ఉండొచ్చు.. కానీ కుటుంబంలో అనూహ్య ఘటనలేమైనా తలెత్తితే ఆర్థిక ప్రణాళికలు తల్లకిందులయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు. అందుకే తల్లిదండ్రులు తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంటుంది. పరిస్థితులు మారినా, పిల్లల కోసం మీరు వేసిన ఆర్థిక ప్రణాళిక పట్టాలు తప్పకుండా, సజావుగా సాగుతుందా లేదా అనేది ఆలోచించాలి. క్రమశిక్షణతో కూడుకున్న పొదుపును, ఆర్థిక భద్రతను మేళవించే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఇందుకు ఉపయోగపడతాయి.

పిల్లల బీమాతో ఉపయోగాలేమిటంటే..
ఎంచుకున్న పథకాన్ని బట్టి, చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వివిధ రకాల ఫీచర్లతో దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు దోహదపడేలా ఉంటాయి.
కచ్చితమైన మెచ్యూరిటీ బెనిఫిట్స్: ఉన్నత విద్య లేదా కెరియర్ లక్ష్యాల్లాంటి ప్రణాళికాబద్ధమైన మైలురాళ్లను సాధించడం కోసం నిధిని ఏర్పర్చుకోవడం ద్వారా ఆర్థిక భరోసాను పొందడానికి ఇది ఉపయోగకరం.
సరళతరంగా పేఅవుట్ ఆప్షన్లు: భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఏకమొత్తంగా తీసుకోవాలా లేక విడతలవారీగా తీసుకోవాలా అనే ఆప్షన్ పేరెంట్స్ చేతుల్లోనే ఉంటుంది.
ప్రీమియం వెయివర్: ఒకవేళ పేరెంట్స్ అనూహ్యంగా కన్నుమూసినా లేదా ప్రమాదవశాత్తూ శాశ్వత వైకల్యానికి గురైనా, భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియంలు మాఫీ అవుతాయి. నిర్దేశించుకున్న లక్ష్యానికి ఆటంకం కలగకుండా ఆర్థిక ప్రణాళిక యథావిధిగానే కొనసాగుతుంది.
పిల్లల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ఆర్థికంగా సన్నద్ధం కావడంతో పాటు అనూహ్య పరిస్థితులెదురైనా ప్రణాళికలకు భంగం కలగకుండా రక్షణ కల్పించేందుకు ఇలాంటివి తోడ్పడతాయి.

సరైన ప్లాన్ ఎంచుకోవడం ఇలా..
చైల్డ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అది మీ సమగ్ర ఆర్థిక వ్యూహానికి అనుగుణంగా ఉండాలి. పిల్లల భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించిన మైలురాళ్లకు తగ్గట్లుగా ఉందా? వారి ఆర్థిక అవసరాలకు సరిపోయే విధంగా ప్రయోజనాలు, పేఅవుట్ ఆప్షన్లు ఉన్నాయా? ప్రణాళిక పట్టాలు తప్పకుండా ఇన్సూరెన్స్ ప్లాన్‌లో భద్రత ఫీచర్లు ఉన్నాయా? విస్తృత ఆర్థిక ప్రణాళికకు తగ్గట్లుగా ఉందా? ఇలాంటివన్నీ చూసుకోవాలి.
మరింత ఎక్కువ పొదుపు చేయడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. మారే పరిస్థితులకు తగ్గట్లుగా మల్చుకోగలిగేలా ఆర్థిక ప్రణాళికలు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. కలలను సాకారం చేసుకోగలిగేలా తమ పిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని అందించాలని తల్లిదండ్రులంతా ఆకాంక్షిస్తారు. అవకాశాలు రావడానికి ముందే వాటిని అందిపుచ్చుకునేందుకు సన్నద్ధంగా ఉంటే ఒత్తిడి ఉండదు.
ఈ దిశగా నేడు సత్వరం సరైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడం ద్వారా దీనికి శ్రీకారం చుట్టొచ్చు. ఆర్థిక పునాదులు బలంగా ఉంటే, పిల్లల కలలను సాకారం చేయడంలో తల్లిదండ్రులకు భరోసాగా ఉంటుంది. ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల రాజీపడే అవసరం లేకుండా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తోడ్పడుతుంది.


