ఎన్నారై నుంచి ప్రాపర్టీ కొంటున్నారా? కొత్త రూల్‌ తెలుసా? | NRI Property Buyers Get Relief, PAN Based TDS Payments Allowed Without TAN From October 1, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఎన్నారై నుంచి ప్రాపర్టీ కొంటున్నారా? కొత్త రూల్‌ తెలుసా?

Aug 30 2026 5:59 PM | Updated on Aug 30 2026 6:45 PM

NRI Property Purchase New TDS Rules PAN Replace TAN October 1 2026

విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల నుంచి ఇల్లు, ఫ్లాట్‌ వంటి ప్రాపర్టీలేవైనా కొంటుంటే దీనికి సంబంధించిన ముఖ్యమైన పన్ను నిబంధన మారబోతోంది. ప్రస్తుతం ఎన్నారై నుంచి ప్రాపర్టీని కొనుగోలు చేసే రెసిడెంట్‌ వ్యక్తి (భారత్‌లో ఉంటున్న పౌరుడు) లేదా హిందూ అవిభక్త కుటుంబం (HUF) టీడీఎస్‌ మినహాయించేందుకు ముందుగా టాన్‌ (TAN - Tax Deduction and Collection Account Number)తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే అక్టోబర్‌ 1 నుంచి ఈ అదనపు నిబంధన తొలగనుంది. అర్హత కలిగిన రెసిడెంట్‌ వ్యక్తులు టాన్‌ తీసుకోకుండానే తమ పాన్‌ ఆధారంగా టీడీఎస్‌ చెల్లించేందుకు వీలు కల్పించారు.

ప్రస్తుత ప్రక్రియ

2026 సెప్టెంబర్‌ 30 వరకు ఎన్నారై నుంచి ప్రాపర్టీ కొనుగోలు చేసే రెసిడెంట్‌ వ్యక్తి లేదా హెచ్‌యూఎఫ్‌కు ప్రస్తుత నిబంధనలే వర్తిస్తాయి. అంటే టీడీఎస్‌ బాధ్యత ఉన్న కొనుగోలుదారు టాన్‌ పొందాలి. అలాగే వర్తించే టీడీఎస్‌ను మినహాయించి, నిర్దేశిత విధానంలో ప్రభుత్వానికి జమ చేసి సంబంధిత టీడీఎస్‌ స్టేట్‌మెంట్‌ను దాఖలు చేయాలి.

కొత్త నిబంధన అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం అర్హత కలిగిన రెసిడెంట్‌ వ్యక్తి లేదా హెచ్‌యూఎఫ్‌కు ఈ ఒక్క లావాదేవీ కోసం ప్రత్యేకంగా టాన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 2026 బడ్జెట్‌లోనే ఈ మార్పును ప్రతిపాదించారు.

టీడీఎస్‌ ఎలా ఉంటుంది?

ఎన్నారై విక్రేత నుంచి స్థిరాస్తిని కొనుగోలు చేసే సందర్భంలో టీడీఎస్‌  నిబంధనలు, రెసిడెంట్‌ విక్రేతకు వర్తించే నిబంధనలతో భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా రెసిడెంట్‌ విక్రేత నుంచి రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్థిరాస్తి కొనుగోలు చేసినప్పుడు వర్తించే సాధారణ టీడీఎస్‌ నిబంధన ఎన్నారై విక్రేతకు నేరుగా వర్తించదు.

ఎన్నారై విక్రేతకు చెల్లించే మొత్తంపై వర్తించే టీడీఎస్‌, విక్రేతకు ఏర్పడే మూలధన లాభాల స్వభావం, వర్తించే పన్ను నిబంధనల ఆధారంగా నిర్ణయిస్తారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో ఎన్నారైలకు చెల్లింపులపై టీడీఎస్‌ నిబంధనలు సెక్షన్‌ 393లోని సంబంధిత పట్టికలో పొందుపరిచారు. కొత్త చట్టంలో పాత టీడీఎస్‌ నిబంధనలను సరళమైన పట్టిక రూపంలోకి తీసుకొచ్చినప్పటికీ, టీడీఎస్‌ రేట్లు, పరిమితుల్లో పెద్దగా విధానపరమైన మార్పు లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement