పీఎఫ్ (PF) డబ్బు అంటే.. ఉద్యోగులకు భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడే ముఖ్యమైన పొదుపు. అందుకే, చాలా మంది పీఎఫ్ బ్యాలెన్స్‌ను పూర్తిగా సురక్షితమైనదిగా భావిస్తుంటారు. అయితే.. పీఎఫ్ మొత్తాన్ని ఎప్పుడు పడితే అప్పుడు విత్‌డ్రా చేసుకుంటే మాత్రం పన్ను నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎంతకాలం ఉద్యోగంలో కొనసాగారు?, పీఎఫ్‌ను ఎప్పుడు విత్‌డ్రా చేస్తున్నారు? అనే అంశాలపై ట్యాక్స్ ఆధారపడి ఉంటుంది.
ఐదేళ్లలోపు పీఎఫ్ విత్‌డ్రా చేస్తే..
మీరు ఒకే సంస్థలో లేదా వేర్వేరు సంస్థల్లో కలిపి ఐదేళ్ల నిరంతర సర్వీస్ పూర్తి చేయకముందే పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే, కొన్ని సందర్భాల్లో ఆ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.
ఉదాహరణకు.. మీరు ఒక కంపెనీలో మూడేళ్లు పనిచేసి, తర్వాత మరో కంపెనీకి మారారని అనుకుందాం. మొదటి కంపెనీ పీఎఫ్‌ను రెండో కంపెనీ పీఎఫ్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేస్తే, ఈ సర్వీస్ కాలం సాధారణంగా కొనసాగింపుగానే పరిగణిస్తారు. కాబట్టి కంపెనీ మారినంత మాత్రాన ఐదేళ్ల సర్వీస్ మళ్లీ మొదటి నుంచి లెక్కించరు. కానీ.. ఐదేళ్లు పూర్తికాకముందే పీఎఫ్‌ను విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ నిబంధనలు వర్తించవచ్చు.
TDS కూడా కట్ అవుతుంది
ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందే పీఎఫ్ విత్‌డ్రా చేసినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో టీడీఎస్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంది. పాన్ వివరాలు అందుబాటులో ఉంటే.. సాధారణంగా 10 శాతం టీడీఎస్ వర్తించే అవకాశం ఉంటుంది. పాన్ ఇవ్వకపోతే ఎక్కువ రేటుతో టీడీఎస్ కట్ అవుతుంది. అందుకే.. పీఎఫ్ విత్‌డ్రా చేసే ముందు మీ పాన్ వివరాలు యూఏఎన్ ఖాతాలో సరిగ్గా అప్డేట్ అయ్యాయా లేదా చూసుకోవడం మంచిది.
ఐదేళ్లు పూర్తయితే ట్యాక్స్ ఉండదా?
సాధారణంగా ఐదేళ్లు ఉద్యోగం పూర్తయిన తర్వాత పీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటే.. పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్‌ను కొత్త ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ వెళ్తే సర్వీస్ కొనసాగింపును కాపాడుకోవచ్చు. అందుకే అత్యవసరం లేకపోతే కేవలం ఉద్యోగం మారిన కారణంతో పీఎఫ్ మొత్తాన్ని వెంటనే విత్‌డ్రా చేసుకోవడం కంటే, కొత్త ఉద్యోగంలోని పీఎఫ్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయడం ప్రయోజనకరంగా ఉండొచ్చు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి వాటా రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అదనపు మొత్తంలో వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. అందువల్ల పెద్ద జీతాలు పొందే ఉద్యోగులు, ఎక్కువ మొత్తంలో పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేసే వారు తమ పీఎఫ్ స్టేట్‌మెంట్‌లో కాంట్రిబ్యూషన్, వడ్డీ వివరాలను గమనించడం మంచిది.
ఫారమ్ 15G, 15H ఎప్పుడు ఉపయోగపడతాయి?
కొన్ని సందర్భాల్లో ఫారమ్ 15G లేదా ఫారమ్ 15H సమర్పించడం ద్వారా టీడీఎస్ కట్ కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫారాలను ప్రతి ఒక్కరూ ఇవ్వలేరు. ఆదాయం, వయస్సు, పన్ను బాధ్యత వంటి అర్హతలను బట్టి ఇవి వర్తిస్తాయి. అందుకే పెద్ద మొత్తంలో పీఎఫ్ విత్‌డ్రా చేయబోతున్నవారు ముందుగా తమ పన్ను పరిస్థితిని పరిశీలించడం మంచిది.
ఇదీ చదవండి: EPFO బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్!


