దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి మరో తీపి కబురు అందనుంది. ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈపీఎఫ్‌వో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇకపై పీఎఫ్ డబ్బులను ఉపసంహరించుకోవడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా యూపీఐ ద్వారా నేరుగా డబ్బులు పొందే సదుపాయాన్ని తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్ డిసెంబర్ 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ‘ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ కథనం వెల్లడించింది.
భీమ్ యాప్‌తో పీఎఫ్ విత్‌డ్రా
ఈ కొత్త సదుపాయం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు భీమ్ (BHIM) యాప్‌ను ఉపయోగించి తమ ఖాతాలోని అర్హత కలిగిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి అర్హత ఉందో, ఖాతాలో కనీసం ఎంత మొత్తం ఉండాలో కూడా యాప్‌లోనే తెలుసుకోవచ్చు. ఇందుకోసం సభ్యుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), యూపీఐ ఖాతాలను అనుసంధానించనున్నారు. EPFO ఖాతాకు అనుసంధానమై, ధ్రువీకరణ పూర్తయిన బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఈ సదుపాయం వర్తించే అవకాశం ఉంది.
ఈ ఫీచర్‌కు సంబంధించి ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని, పరీక్షల సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే అధికారిక ప్రారంభ తేదీని ఈపీఎఫ్‌వో ఇంకా ప్రకటించలేదు.
ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు?
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, అర్హత కలిగిన ఈపీఎఫ్ సభ్యులు తమ మొత్తం పీఎఫ్ నిల్వలో 75 శాతం వరకు పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 25 శాతం రిటైర్మెంట్ పొదుపుగా ఖాతాలో ఉండాలి. అయితే యూపీఐ ద్వారా ఉపసంహరణకు ప్రత్యేకంగా ఎంత పరిమితి విధిస్తారనే విషయంపై ఈపీఎఫ్‌వో అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, నవంబర్ 19న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 240వ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఎఫ్ ఖాతాలో తప్పనిసరిగా ఉంచాల్సిన కనీస నిల్వను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో భవిష్యత్తులో అర్హత కలిగిన ఉపసంహరణ పరిమితి 90 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, దీనిపై తుది నిబంధనలు ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.
ఎన్నిసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు?
ఈపీఎఫ్‌వో ఇప్పటికే పాక్షిక ఉపసంహరణ నిబంధనలను సరళీకరించింది. గతంలో ఉన్న 13 రకాల నిబంధనలను అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాలుగా మార్చింది. విద్య కోసం గరిష్ఠంగా 10 సార్లు, వివాహం కోసం ఐదు సార్లు పీఎఫ్ డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించింది. కనీస ఉద్యోగ సేవా కాలాన్ని 12 నెలలుగా నిర్ణయించింది. అర్హత కలిగిన ముందస్తు క్లెయిమ్‌ల ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని కూడా రూ.5 లక్షలకు పెంచింది.
మరోవైపు, నవంబర్ 19 సమావేశంలో ఉద్యోగం మానేసిన తర్వాత తుది PF సెటిల్‌మెంట్ కోసం వేచి ఉండాల్సిన గడువును 12 నెలల నుంచి రెండు నెలలకు తగ్గించేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ మార్పులన్నీ ఈపీఎఫ్‌వో చేపడుతున్న విస్తృత సాంకేతిక ఆధునికీకరణ కార్యక్రమం ‘EPFO 3.0’లో భాగంగా ఉన్నాయి. ఈ కొత్త వ్యవస్థను 2027 ఫిబ్రవరిలో ప్రారంభించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులకు నగదు ఉపసంహరణతో పాటు ఇతర సేవలు కూడా మరింత వేగంగా, సులభంగా అందనున్నాయి.


