ఆర్థిక సంక్షోభం రాబోతోందా?.. బంగారం కొంటున్న కియోసాకి! | Rich Dad Poor Dad Author Robert Kiyosaki Says About Gold Silver and Bitcoin | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభం రాబోతోందా?.. బంగారం, వెండి కొంటున్న కియోసాకి!

Nov 23 2026 1:19 PM | Updated on Nov 23 2026 1:36 PM

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Says About Gold Silver and Bitcoin

ప్రముఖ ఇన్వెస్టర్.. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా.. అమెరికా ప్రభుత్వం చేస్తున్న భారీ అప్పులు, ఫెడరల్ రిజర్వ్ విధానాలు, డబ్బు ముద్రణ, ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో పెరుగుతున్న రిస్క్‌ల వల్ల పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాను ETFల ద్వారా కాకుండా.. నేరుగా బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం వంటి ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు రియల్ ఎస్టేట్, చమురులో కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు.

అప్పుల గురించి ఆందోళన
కియోసాకి ప్రధానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అప్పుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రతి 90 రోజులకు ఒక ట్రిలియన్ డాలర్ల అప్పును పెంచుకుంటూ పోతోందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఒక ట్రిలియన్ డాలర్ అంటే 1,000 బిలియన్ డాలర్లు. అంటే ఒకటి తర్వాత 12 సున్నాలు ఉంటాయి. ఈ భారీ మొత్తంలో అప్పులు, డబ్బు సరఫరా పెరగడం వల్ల భవిష్యత్తులో డబ్బు విలువ తగ్గి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందన్నది ఆయన వాదన.

ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు తమ ప్రయోజనాలకే.. ప్రాధాన్యత ఇస్తున్నాయని, సామాన్య ప్రజల ఉద్యోగాలు, పొదుపు, పదవీ విరమణ నిధుల భద్రత గురించి సరైన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.

ఉద్యోగ భద్రతకు ముప్పు
కృత్రిమ మేధస్సు (AI) కారణంగా భవిష్యత్తులో ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని కూడా కియోసాకి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొన్ని పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయని, ఏఐ విస్తరణతో ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే.. కేవలం ఉద్యోగం, జీతం, బ్యాంకు పొదుపులపైనే ఆధారపడకుండా ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.

2002లోనే తన 'రిచ్ డాడ్స్ ప్రాఫసీ' పుస్తకంలో ఇలాంటి ఆర్థిక ప్రమాదాల గురించి హెచ్చరించినట్లు కియోసాకి గుర్తుచేశారు. ప్రజలు ఆర్థికంగా ముందుగానే సిద్ధపడాలని, డబ్బు ఎలా పనిచేస్తుంది, పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఆస్తులను ఎలా నిర్మించుకోవాలి అనే విషయాలు నేర్చుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'క్యాష్‌ఫ్లో క్లబ్స్‌'లో చేరాలని, లేదా సొంతంగా ఒక క్లబ్‌ను ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement