బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! | Cheque Book New Rules 2026 Know The Fulle Details Here | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్!

Aug 22 2026 3:05 PM | Updated on Aug 22 2026 3:24 PM

Cheque Book New Rules 2026 Know The Fulle Details Here

డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. బ్యాంక్ చెక్కుల వినియోగం మాత్రం పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు, లేదా పెద్ద మొత్తాల చెల్లింపుల కోసం ఇప్పటికీ చెక్కులను ఉపయోగిస్తున్నారు. దీంతో.. చెక్కుల భద్రతపై బ్యాంకులు మరింత దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్త భద్రతలను ప్రవేశపెడుతున్నాయి.

చెక్కుల్లో కొత్త భద్రతలు ఎందుకు?
చెక్కుల ద్వారా జరిగే మోసాలను తగ్గించేందుకు బ్యాంకులు కొత్త భద్రతా విధానాలను ప్రవేశపెడుతున్నాయి. చెక్కును మార్చడం, నకిలీ చెక్కులు ఉపయోగించడం వంటి మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక కోడ్‌లు, ఇతర భద్రతలను చేర్చుతున్నారు.

ఉదాహరణకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త చెక్ లీఫ్‌లపై అక్షరాలు, సంఖ్యల కలయికతో కూడిన అల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. ఈ కోడ్ ద్వారా చెక్‌ను సులభంగా గుర్తించడంతో పాటు, దాని వివరాలను ధృవీకరించడంలో బ్యాంకుకు సహాయం అవుతుంది.

అల్ఫాన్యూమరిక్ కోడ్ అంటే ఏమిటి?
అల్ఫాన్యూమరిక్ కోడ్ అంటే.. అక్షరాలు, సంఖ్యలు కలిపి ఉండే ఒక ప్రత్యేక గుర్తింపు కోడ్. ఇది చెక్ లీఫ్‌ను గుర్తించడానికి, చెక్ క్లియరింగ్ సమయంలో ధృవీకరణను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. పాత చెక్‌బుక్‌లో ఈ కోడ్ లేనప్పటికీ చెల్లుబాటు అవుతాయి. అయితే.. ప్రతి బ్యాంకు దీనికి సంబంధించి తన ఖాతాదారులకు వేర్వేరు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సందేహం ఉంటే.. మీ బ్యాంకు ద్వారా అధికారిక సమాచారం తెలుసుకోవడం మంచిది.

ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు
చెక్కుల క్లియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెక్ ట్రంకేషన్ సిస్టమ్(CTS)ను అమలు చేస్తోంది. ఈ విధానంలో చెక్‌ను ఫిజికల్‌గా ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు పంపకుండా.. చెక్‌ ఎలక్ట్రానిక్ ఇమేజ్, అవసరమైన సమాచారాన్ని చెల్లింపు బ్యాంకుకు పంపిస్తారు. దీంతో చెక్ క్లియరింగ్ ప్రక్రియ వేగంగా, సురక్షితంగా జరుగుతుంది.

డిసెంబర్ 31, 2026 గడువు
అల్ఫాన్యూమరిక్ కోడ్ లేని కొన్ని చెక్కులకు, ముఖ్యంగా రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన చెక్కులకు, 2026 డిసెంబర్ 31 గడువు ఉందని కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. ఇది అన్ని బ్యాంకులకు వర్తించే సాధారణ RBI గడువు అని భావించకూడదు. ఖాతాదారులు తమ బ్యాంకు నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకోవాలి.

పాత చెక్‌బుక్‌ను మార్చాల్సిన అవసరం ఉందా?, ఏదైనా చివరి తేదీ ఉందా?, అనే విషయాలను బ్యాంకు శాఖను సంప్రదించడం లేదా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ చూడడం ద్వారా తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: SBI ఖాతాదారులకు షాక్.. అక్టోబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌!

కొత్త చెక్‌బుక్‌కు ఛార్జీలు ఉంటాయా?
కొత్త చెక్‌బుక్‌ కోసం వసూలు చేసే ఛార్జీలు బ్యాంకు, ఖాతా రకాన్ని బట్టి మారుతాయి. ఉదాహరణకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 25 లీఫ్‌లను ఉచితంగా అందిస్తుందని పేర్కొంది. అదనపు చెక్ లీఫ్‌లకు బ్యాంకు నిర్ణయించిన ఛార్జీలు వర్తించవచ్చు. అందువల్ల కొత్త చెక్‌బుక్‌ తీసుకునే ముందు మీ బ్యాంకు తాజా ఛార్జీల వివరాలను తెలుసుకోవడం మంచిది.

చెక్ ఎంతకాలం చెల్లుతుంది?
సాధారణంగా.. ఒక చెక్‌పై ఉన్న తేదీ నుంచి మూడు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. అందువల్ల చెక్‌ను ఎక్కువ కాలం ఉంచకుండా.. మూడు నెలల లోపే బ్యాంకులో జమ చేయాలి. చెక్‌ బౌన్స్ అయితే పరిస్థితులను బట్టి ఆర్థిక, చట్టపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement