స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతా ఉన్నవారికి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా చేసే విషయంలో ఎస్‌బీఐ కొన్ని మార్పులు చేసింది. కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త రూల్స్
ఇప్పటివరకు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు నెలలో మొదటి నాలుగు క్యాష్ విత్‌డ్రాలు ఉచితంగా ఉండేవి. ఈ పరిమితి దాటిన తర్వాతే ఛార్జీలు వర్తించేవి.
కొత్త రూల్స్ ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి కూడా మొదటి నాలుగు విత్‌డ్రాలు ఉచితంగానే ఉంటాయి. కానీ ఆ తర్వాత చేసే ప్రతి క్యాష్ విత్‌డ్రాకు రూ.15తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక్కడే అసలు మార్పు వచ్చింది. గతంలో ఈ నాలుగు ఉచిత లావాదేవీలను లెక్కించేటప్పుడు కొన్ని డిజిటల్ లావాదేవీలను మినహాయించేవారు. ఇప్పుడు ఎస్‌బీఐ ఆ మినహాయింపును తొలగించింది. దీంతో ఖాతాదారులు తమ నెలవారీ విత్‌డ్రాలను కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.
BSBD ఖాతా అంటే ఏంటి?
బీఎస్‌బీడీ అంటే 'బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్'. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా సులభంగా బ్యాంకింగ్ సేవలు పొందేలా ఈ ఖాతాలను రూపొందించారు. ఈ ఖాతాలో పెద్ద ప్రయోజనం ఏంటంటే.. మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. అంటే.. ఖాతాలో ఎప్పుడూ ఒక నిర్దిష్ట మొత్తాన్ని తప్పనిసరిగా ఉంచాల్సిన భారం ఉండదు. అయితే సాధారణ సేవింగ్స్ ఖాతాలతో పోలిస్తే కొన్ని సదుపాయాలు పరిమితంగా ఉంటాయి.
ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాదారులకు సాధారణంగా చెక్‌బుక్ సదుపాయం ఉండదు. నగదు అవసరమైతే బ్రాంచ్‌లో విత్‌డ్రా ఫారమ్ ఉపయోగించవచ్చు లేదా ఏటీఎం ద్వారా డబ్బు తీసుకోవచ్చు. అలాగే ఖాతాదారులకు రూపే ఏటిఎమ్-కమ్-డెబిట్ కార్డు ఇస్తారు. ఈ కార్డుపై వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ ఉండదు.
మరో ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతా ఉంటే?
బీఎస్‌బీడీ ఖాతా తెరిచే విషయంలో ఎస్‌బీఐ మరో నిబంధన కూడా పెట్టింది. ఇప్పటికే ఎస్‌బీఐలో సాధారణ సేవింగ్స్ ఖాతా ఉన్న వ్యక్తి బీఎస్‌బీడీ ఖాతా ఓపెన్ చేస్తే.. రెండు ఖాతాలను ఒకేసారి కొనసాగించడానికి వీలు ఉండదు. బీఎస్‌బీడీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అప్పటికే ఉన్న సేవింగ్స్ ఖాతాను 30 రోజుల్లోపు క్లోజ్ చేయాల్సి ఉంటుంది.
ఏటీఎంలో డబ్బు తీసుకుంటే..
నెలకు నాలుగు ఉచిత క్యాష్ విత్‌డ్రాల విషయంలో కేవలం ఎస్‌బీఐ ఏటీఎంలను మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి చేసే విత్‌డ్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే.. బ్రాంచ్‌లో నగదు తీసుకోవడం, ఏఈపీఎస్ ద్వారా చేసే క్యాష్ విత్‌డ్రాలు కూడా ఈ ఉచిత పరిమితిలోకి వస్తాయి. అంటే.. ఒక నెలలో ఏటీఎం, బ్రాంచ్, ఏఈపీఎస్ ద్వారా కలిపి నాలుగు ఉచిత విత్‌డ్రాలు పూర్తయ్యాక.. తదుపరి క్యాష్ విత్‌డ్రాలకు ఛార్జీ పడే అవకాశం ఉంటుంది.
అన్ని సేవలకు ఛార్జీలు ఉండవు
ఈ కొత్త మార్పు కేవలం క్యాష్ విత్‌డ్రాల విషయంలోనే. బీఎస్‌బీడీ ఖాతాలో ఇంకా కొన్ని సేవలు ఉచితంగానే ఉంటాయి. రూపే డెబిట్ కార్డు ఉచితంగా లభించడంతో పాటు దానికి వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ ఉండదు. అలాగే ఎన్ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్ వంటి ఎలక్ట్రానిక్ మార్గాల్లో డబ్బు జమ కావడానికి ఛార్జీలు ఉండవు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన చెక్కుల డిపాజిట్ లేదా కలెక్షన్‌కు కూడా ఛార్జీ ఉండదు. ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడానికి కూడా ఛార్జీలు ఉండవు.
ఇదీ చదవండి: అప్పు చేసి ఆస్తులు కొంటున్న కియోసాకి!


