దేశవ్యాప్తంగా జరగనున్న మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక ఊరటనిచ్చాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మె జరిగే మూడు రోజుల్లో ఏటీఎం నుంచి నగదు తీసుకునేటప్పుడు సాధారణంగా వర్తించే ఉచిత లావాదేవీల పరిమితిని దాటినా అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకులు ఈ సౌకర్యాన్ని ప్రకటించిన వాటిలో ఉన్నాయి.
ఏటీఎం ఛార్జీలపై ప్రత్యేక మినహాయింపు
సాధారణంగా సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు తమ సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే ఆరు మెట్రో నగరాల్లో నెలకు మూడు, ఇతర ప్రాంతాల్లో ఐదు లావాదేవీల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ పరిమితిని దాటిన తర్వాత బ్యాంకులు ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23 వరకు, దానికి వర్తించే జీఎస్టీతో కలిపి ఛార్జీ విధించవచ్చు. అయితే సెప్టెంబర్ 28–30 మధ్య ఈ అదనపు ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాఫీ చేస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా సమ్మె సమయంలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంను ఉపయోగించినా లావాదేవీ ఛార్జీలు వర్తించవని ప్రకటించింది. ఎస్‌బీఐ సైతం సమ్మె కాలంలో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో నగదు అవసరమయ్యే ఖాతాదారులు తమ సాధారణ ఉచిత పరిమితి ముగిసినా ఈ మూడు రోజుల్లో అదనపు ఏటీఎం రుసుము గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
ఆదివారమూ బ్యాంకులు ఓపెన్
సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు సెప్టెంబర్ 27, ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. అత్యవసర బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులను సెప్టెంబర్ 27న బ్రాంచ్ సేవలను వినియోగించుకోవాలని సూచించాయి.
సెప్టెంబర్ 26 నాలుగో శనివారం కావడంతో ఇప్పటికే బ్యాంకులకు సెలవు ఉంది. ఆ తర్వాత 27న ఆదివారం, 28 నుంచి 30 వరకు సమ్మె జరగనుండటంతో బ్రాంచ్ సేవలకు వరుసగా పలు రోజులపాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల చెక్కులు, నగదు డిపాజిట్లు, ఇతర బ్రాంచ్ ఆధారిత పనులు ఉన్నవారు ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
ఇదీ చదవండి: యూపీఐ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చేసిన ఆర్థిక మంత్రి
Banking doesn’t stop. Your needs don’t have to wait.
Even during the proposed strike period, SBI continues to keep essential banking services accessible through ATMs, YONO, Internet Banking, Mobile Banking, WhatsApp Banking and 24×7 Contact Centre services.
For Seamless… pic.twitter.com/P1FTsjtSws— State Bank of India (@TheOfficialSBI) September 24, 2026


