ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ తదితర యాపిల్ ఉత్పత్తులు ఉపయోగిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఇన్ (CERT-In) కీలక హెచ్చరిక జారీ చేసింది. యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్‌లో గుర్తించిన పలు భద్రతా లోపాలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కు అప్‌డేట్ కావాలని సూచించింది. ఈ హెచ్చరికను సెప్టెంబర్ 21న ‘CIVN-2026-0468’ పేరుతో విడుదల చేసింది. దీనికి ‘హై’ స్థాయి ప్రమాద రేటింగ్‌ను ఇచ్చింది.
ఏయే పరికరాలకు ముప్పు?
CERT-In ప్రకారం iOS 26.7 కంటే ముందు వెర్షన్లు, iPadOS 26.7 కంటే ముందు వెర్షన్లు, macOS Golden Gate 27 కంటే ముందు వెర్షన్లు, macOS Tahoe 26.7 కంటే ముందు వెర్షన్లు, macOS Sequoia 15.8 కంటే ముందు వెర్షన్లు ఈ హెచ్చరిక పరిధిలో ఉన్నాయి. అలాగే tvOS 27, watchOS 27, visionOS 27, Safari 27, Xcode 27 కంటే ముందు ఉన్న వెర్షన్లలోనూ లోపాలు ఉన్నట్లు పేర్కొంది.
ఈ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు పరికరంలో తమకు నచ్చిన కోడ్‌ను అమలు చేయడం, సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడం, భద్రతా నియంత్రణలను దాటడం లేదా సేవలను నిలిపివేసే పరిస్థితులు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని సీఈఆర్టీ-ఇన్ వివరించింది.
273 భద్రతా లోపాలకు పరిష్కారం
ఈ హెచ్చరికకు ముందు యాపిల్ సెప్టెంబర్ 14న తన పలు ఆపరేటింగ్ సిస్టమ్‌లకు భారీ భద్రతా అప్‌డేట్స్‌ను విడుదల చేసింది. iOS 27, iPadOS 27, iOS 26.7, iPadOS 26.7, macOS Golden Gate 27, macOS Tahoe 26.7, macOS Sequoia 15.8, tvOS 27, watchOS 27, visionOS 27, Safari 27, Xcode 27 వంటి వెర్షన్లు అందుబాటులోకి వచ్చాయి.
స్వతంత్ర సైబర్ భద్రతా సంస్థ జీరో డే ఇనిషియేటివ్ (ZDI) విశ్లేషణ ప్రకారం.. సెప్టెంబర్ 2026 యాపిల్ సేఫ్టీ అప్‌డేట్లలో మొత్తం 273 ప్రత్యేక CVEలను పరిష్కరించారు. వీటిలో కొన్ని అత్యంత తీవ్రమైన లోపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్క్రీన్ షేరింగ్ సర్వర్, బ్లూటూత్‌కు సంబంధించిన లోపాలను జాబితాలో చేర్చినట్లు జెడ్‌డీఐ పేర్కొంది.
యూజర్లు ఏం చేయాలి?
ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు Settings → General → Software Updateలోకి వెళ్లి తమ పరికరంలో తాజా అప్‌డేట్ అందుబాటులో ఉందో పరిశీలించాలి. మ్యాక్ యూజర్లు System Settings → General → Software Update ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. యాపిల్ ఇప్పటికే ఈ భద్రతా సమస్యలకు పరిష్కారాలను విడుదల చేసినందున అప్‌డేట్‌ను వాయిదా వేయకుండా ఇన్‌స్టాల్ చేసుకోవడం ముఖ్యమని సీఈఆర్టీ-ఇన్ సూచన సారాంశం.
అదేవిధంగా గుర్తు తెలియని లింకులు, అనుమానాస్పద వెబ్‌సైట్లు, ఈమెయిల్ అటాచ్‌మెంట్లు, నమ్మకం లేని యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్‌లో ఉంచడం ద్వారా ఇలాంటి తెలిసిన భద్రతా లోపాల నుంచి పరికరాన్ని రక్షించుకునే అవకాశం పెరుగుతుంది.
ఇదీ చదవండి: ఫోన్ రీచార్జ్‌లపై గుడ్‌న్యూస్.. చౌక ప్లాన్లు వస్తున్నాయ్!


